అక్షరటుడే, వెబ్‌డెస్క్: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక టోల్ పాస్(annual toll pass)ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఒకేసారి నిర్ణీత మొత్తాన్ని చెల్లించి ఏడాది పొడవునా టోల్ ఫీజు చెల్లించకుండా ప్రయాణం చేసే అవకాశం త్వరలోనే అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆగస్టు 15, 2025 నుంచి కొత్త వార్షిక FASTag ప్లాన్ ను ఆవిష్కరించనుంది.
అయితే, వాహనదారులందరూ వార్షిక పాస్ తీసుకోవడం తప్పనిసరి కాదు. పాస్ అవసరం లేని వారు తమ సాధారణ లావాదేవీల కోసం వారి FASTagను మామూలుగానే వినియోగించుకోవచ్చు. అయితే, వార్షిక పాస్ కావాలనుకునే వారు నేషనల్ హైవే అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NHAI) వెబ్సైట్ లేదా రాజ్ మార్గ యాత్ర మొబైల్ యాప్ (Raj Marga Yatra mobile app) ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు.
FASTag | వార్షిక పాస్ కు మారితే కలిగే ప్రయోజనాలు..
- వార్షిక పాస్ పొందిన వాహనదారులు కొన్ని అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. జాతీయ రహదారులతో పాటు జాతీయ ఎక్స్ ప్రెస్ వేలపై ఉన్న టోల్ ప్లాజాల మీదుగా ఉచితంగానే ప్రయాణించవచ్చు. అయితే, ఈ పాస్ ను ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పుల వరకు మాత్రమే పొందవచ్చు.
- వార్షిక పాస్ ప్రస్తుత FASTagలోనే అమలులో ఉంటుంది. కాబట్టి వాహనదారులు కొత్త FASTag పొందడం తప్పనిసరి కాదు.
- సంవత్సరానికి రూ. 3 వేలు చెల్లించడం ద్వారా వాహనదారులు రెండు గంటల్లోనే తమ రిజిస్టర్డ్ FASTagలో వార్షిక పాస్ కు యాక్టివేట్ చేసుకోవచ్చు.
- వార్షిక పాస్ ఒక సంవత్సరం పాటు పనిచేస్తుంది, యాక్టివేషన్ తేదీ నుంచి మరుసటి ఏడాది అదే తేదీ వరకు గడువు ఉంటుంది. అయితే, 200 ట్రిప్పుల వరకు మాత్రమే ఈ పాస్ చెల్లుబాటులో ఉంటుంది. అంతకు మించితే టోల్ చెల్లించాలి.
- వార్షిక పాస్ చెల్లుబాటు గడువు ముగిసిన తర్వాత.. అది సాధారణ FASTagగా పనిచేయడం ప్రారంభిస్తుంది.
FASTag | వాటికి మాత్రమే పాస్..
వాణిజ్యేతర వాహనాలకు (non-commercial vehicles) మాత్రమే వార్షిక పాస్ ఇస్తారు. ప్రైవేట్, వాణిజ్యేతర కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే యాన్యువల్ ప్లాన్ కొనుగోలు చేయవచ్చు. వార్షిక పాస్ కలిగి ఉండటానికి అర్హత వాహన్ డేటాబేస్ ద్వారా ధ్రువీకరించబడుతుంది. కమర్షియల్ వెహికిల్ కు వార్షిక పాస్ ను వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే డీ యాక్టివేట్ చేయనున్నట్లు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ (Union Transport Ministry) పేర్కొంది. అలాగే, ఒకసారి ఒక వాహనానికి తీసుకున్న పాస్ ను మరో వాహనానికి బదిలీ చేయబడదు. అది రిజస్ట్రర్ అయిన వెహికిల్ కు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.