అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma houses | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ప్రవేశ పెట్టింది. అర్హులైన పేదలకు ఇళ్లను మంజూరు చేసింది.
నియోజకవర్గానికి 3,500 ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సొంత స్థలంలో ప్రభుత్వం సూచించిన కొలతల మేరకు ఇళ్ల నిర్మాణం చేపడితే రూ.5 లక్షల ఆర్థికసాయం అందించనుంది. విడతల వారీగా ఈ సాయం లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతోంది. ప్రస్తుతం చాలా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగంగా సాగుతున్నాయి.
Indiramma houses | స్థానిక ఎన్నికల వేళ
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) జరగనున్నాయి. ఎన్నికల ముందు బిల్లులు త్వరగా వస్తాయని లబ్ధిదారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇళ్లు మంజూరైన వారు నిర్మాణ పనులు ప్రారంభించారు. చాలా వరకు ఇళ్లు బేస్మెంట్ లెవల్ వరకు పూర్తయ్యాయి. బేస్మెంట్ నిర్మాణం పూర్తయితే.. వెంటనే అధికారులకు అప్లికేషన్ పెట్టుకుంటే రూ.లక్ష లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది.
Indiramma houses | పెరిగిన రేట్లు
అన్ని ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనులు ఒకేసారి మొదలు పెట్టారు. దీంతో ధరలు పెరిగి లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో మేస్త్రీల నుంచి కూలీల వరకు ధరలు పెంచేశారు. వేగంగా ఇల్లు నిర్మించుకుంటేనే బిల్లులు వస్తాయని ప్రజలు ఎక్కువ రేట్లు అయినా పనులు చేయించుకుంటున్నారు. సిమెంట్, స్టీల్ రేట్లలో మార్పు లేదు.
Indiramma houses | ఇసుకకు డిమాండ్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో ఇసుకకు ఫుల్ డిమాండ్ వచ్చింది. వాగులు, నదులు నిండుకుండల్లా ఉండడంతో ఇసుక దొరకడం లేదు. దీంతో కొందరు అక్రమార్కులు ఇసుక ధరలను భారీగా పెంచేశారు. గతంలో తవ్వి డంప్ చేసిన ఇసుకను అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఏమన్నా అంటే దొరకడం లేదని చెబుతున్నారు. మరోవైపు మొరం ట్రిప్పుల ధరలు సైతం పెరిగాయి. పెరిగిన ధరలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ధరలను కట్టడి చేయాలని కోరుతున్నారు.