అక్షరటుడే, వెబ్డెస్క్ : Farmers | రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains) అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. మంగళవారం రాత్రి నుంచి పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది.
కామారెడ్డి (Kamareddy), మెదక్ (Medak), నిజామాబాద్ (Nizamabad), నిర్మల్ (Nirmal), సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో వర్షం ప్రభావం అధికంగా ఉంది. దీంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. చెరువులు, కుంటలు నిండి అలుగు పారాయి. పలుచోట్ల వర్షం ధాటికి పంటలు కొట్టుకుపోయాయి. వాగులు ఉధృతంగా ప్రవహించడం, జలాశయాలకు నీరు పోటెత్తడం, చెరువులకు గండ్లు పడడం వంటి ఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
Farmers | మంత్రి సమీక్ష
రాష్ట్రంలో పంట నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 2.21 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు రెండు రోజులుగా అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ పంట నష్టం వివరాలు సేకరించారు.
Farmers | ప్రభుత్వం ఆదుకోవాలి
రైతులు ఎంతో కష్టపడి, పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు కొట్టుకుపోయాయి. వాగులు ఉధృతంగా పారడంతో పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. చెరువులు తెగిపోవడంతో పలు గ్రామాల్లో పంటలు కొట్టుకుపోయాయి దీంతో రైతులు (farmers) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతున్నారు.