అక్షరటడే, ఆర్మూర్: Jeevan Reddy | వరంగల్ రైతు డిక్లరేషన్‌ను అమలు చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడిచిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కారుపై అన్నదాతలు తిరుగుబాటు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (Asannagari Jeevan Reddy) పిలుపునిచ్చారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని (Armoor constituency) పలు గ్రామాల్లో బుధవారం విస్తృతంగా పర్యటించిన జీవన్ రెడ్డి రైతులతో సమావేశాలు నిర్వహించారు.
రైతులతో కలిసి ఆయన ఆయా గ్రామాల రోడ్లపై ఆరబోసిన పంటలను పరిశీలించారు. రోజుల తరబడి ఎదురు చూస్తున్నప్పటికీ పంటలు కొనే దిక్కులేదని, అధికారుల చుట్టూ తిరిగి వేడుకున్నా ఎవరూ కనికరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్కలు వానలకు తడిసి పాడైపోయాయని పలువురు రైతులు (farmers) జీవన్‌రెడ్డి ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్లకోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేసే వరకూ మంత్రులు, ఎమ్మెల్యేలను గ్రామాల్లో అడుగు పెట్టనీయొద్దన్నారు.
Jeevan Reddy | కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టాలి…
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat elections) కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతలు పెట్టాలని.. మళ్లీ కేసీఆర్ (KCR) సీఎం అయితేనే రైతుల కష్టాలు సమసిపోతాయని ఆయన పేర్కొన్నారు. బషీర్ బాగ్‌లో రైతులను కాల్చి చంపిన చంద్రబాబు.. ఆర్మూర్ ఎర్రజొన్న రైతుల కడుపులో బుల్లెట్లు దింపిన పాలకులు పత్తాలేకుండా పోయిన విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ తదితరులు పాల్గొన్నారు.