అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyclone Montha | మొంథా తుపాన్ ప్రభావంతో వర్షాలు పడుతుండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సచివాలయంలో మంగళవారం ఆయన రైతు నేస్తం కార్యక్రమం (Farmer Nestham Program)లో ఖమ్మం, మంచిర్యాల, కామారెడ్డి, నల్గొండ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ రైతులతో మాట్లాడారు.
తుపాన్ ప్రభావంతో చేతి కందిన పత్తి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. తేమ శాతం 12 శాతం మించకుండా రైతులు చర్యలు చేపట్టాలన్నారు. మారిన వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తేమ శాతం 20 వరకు ఉన్నప్పటికి పత్తి కొనుగోళ్లు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.
Cyclone Montha | 72 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు
వానాకాలం సీజన్ పత్తి కొనుగోళ్లు సీసీఐ ప్రారంభించిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 72 జిన్నింగ్ మిల్లుల్లో సోమవారం కొనుగోళ్లు ప్రారంభించినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా 28 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. పత్తి రైతులు తేమ శాతం విషయంలో అప్రమత్తంగా లేకపోతే మద్దతు ధర దక్కక నష్ట పోతారని మంత్రి తుమ్మల (Minister Tummala) తెలిపారు.
Cyclone Montha | యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్ (Kisan App)ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా పత్తి అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. అలాగే రాష్ట్రంలో మంగళవారం నుంచి సోయాబీన్ కొనుగోళ్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైస్ సపోర్ట్ స్కీమ్‌లో మొక్కజొన్న జొన్నలు చేర్చాలని సోయాపై ఉన్న పరిమితులు ఎత్తి వేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. పత్తి రైతులకు సమస్యలు ఉంటే..టోల్ ఫ్రీ నంబర్ 1800 599 5779 కు ఫోన్ చేయాలని సూచించారు.
