అక్షరటుడే, వెబ్డెస్క్: Farmers Protest | రాష్ట్రంలో రైతులకు, అటవీ శాఖ అధికారులకు మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. పలువురు రైతులు ఫారెస్ట్ భూములను (forest lands) ఆక్రమిస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను అధికారులు లాక్కుంటున్నారని రైతులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. అయితే తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంపు కార్యాలయం (Bellampalli MLA Gaddam Vinod camp office) ఎదుట రైతులు పెట్రోల్ డబ్బాలతో ఆందోళన నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా (Mancherial district) నెన్నెల మండల కేంద్రానికి చెందిన కొందరు రైతులు ఆదివారం ఎమ్మెల్యే వినోద్ కార్యాలయానికి వచ్చారు. 20 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములను అధికారులు ఫారెస్ట్ ల్యాండ్స్ అంటున్నారని పేర్కొన్నారు. అంతేగాకుండా తాము సాగు చేసిన పత్తి మొక్కలను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు వచ్చి తమను భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట పెట్రోల్ బాటిళ్లతో నిరసన తెలిపారు. పోలీసులు వారిని సముదాయించి పంపించి వేశారు.