అక్షరటుడే, కోటగిరి: Paddy Centers | ధాన్యం లారీలను అన్లోడ్ చేసుకోకుండా రైస్‌మిల్లర్లు (rice millers) రైతులను ఇబ్బందులు పెడుతున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. కోటగిరి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ లోడైన లారీలను మిల్లర్లు ఖాళీ చేయడం లేదన్నారు. తరుగు వస్తుందని అలాగే ఉంచుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై ఆరబెట్టిన వడ్లు అలాగే ఉంటున్నాయన్నారు. ఎండబెట్టిన వడ్లు అకాల వర్షాలతో తడిసిపోతున్నాయని తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
తరుగు పేరుతో రైస్‌మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని వాపోయారు. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ధాన్యం తరలింపునకు లారీల కొరత లేకుండా చూడాలని కోరారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ గంగాధర్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎముల నవీన్, బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవి కుమార్, హౌగిరావు దేశాయ్, రైతులు, కప్ప సంతోష్, మామిడి శీను, సాయిబాబు, చిలుకయ్య సాదాక్ గంగారం తదితరులు పాల్గొన్నారు.
