అక్షరటుడే, కామారెడ్డి: Ethanol factory | తమ ప్రాణాలను హరించే ఫ్యాక్టరీ నిర్మించడం సరికాదని సదాశివనగర్ మండలం జనగామ రైతులు పేర్కొన్నారు. సోమవారం ఫ్యాక్టరీ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం జూట్ పరిశ్రమ పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ (Food processing unit) నిర్మిస్తున్నామని గత ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణానికి సిద్ధమైతే నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) రైతులకు మద్దతుగా నిలిచి హైకోర్టు నుంచి స్టే తెచ్చారన్నారు.
ప్రస్తుతం అదే ఎమ్మెల్యే ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రారంభోత్సవం చేశారని విమర్శించారు. జూట్ పరిశ్రమ (Jute industry), పప్పు ధాన్యాలు, రైస్ మిల్లులు అని చెప్పి.. ప్రస్తుతం ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో ఆ కెమికల్ మొత్తం తమ గ్రామాన్ని చుట్టుముడుతోందని, ఫలితంగా భూములు కోల్పోతామని వారు వాపోయారు. నీరు కూడా కలుషితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. నిరసనలో పెద్దఎత్తున రైతులు పాల్గొన్నారు.