అక్షరటుడే, వెబ్డెస్క్ : Rangareddy District | వినాయక నవరాత్రోత్సవాల సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో పూజలు, నిమజ్జనాలు జరుపుకుంటున్న తరుణంలో రంగారెడ్డి జిల్లా(Rangareddy District)లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ(Turkaymanzal Municipality) పరిధిలోని హస్తినాపురంలో నివాసముంటున్న ఓ కుటుంబం తమ ఇంట్లో పెట్టుకున్న గణేశుడికి ఐదు తులాల బంగారు గొలుసు వేసి నిమజ్జనానికి తీసుకెళ్లారు. అయితే ఆ బంగారం గురించి నిమజ్జనం తర్వాత గుర్తొచ్చింది!
Rangareddy District | పూజల తర్వాత నేరుగా నిమజ్జనానికి…
మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం, శనివారం ఉదయం కుటుంబ సభ్యులు మాసాబ్ చెరువు(Masab Pond)కి నిమజ్జనం కోసం వెళ్లారు. ఆ సమయంలో గణేశుడి మెడలో వేసిన బంగారు గొలుసు గురించే ఎవరికీ జ్ఞాపకం రాలేదు. విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసిన కొంతసేపటికి ఇంటి మహిళకు సడన్‌గా బంగారు చైన్(Gold Chain) గుర్తొచ్చింది. వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. విషయం తెలియగానే, వెంటనే మున్సిపల్ సిబ్బందిని సంప్రదించారు. వారు అప్రమత్తమై సహాయంతో చెరువులో నిమజ్జనమైన విగ్రహాలను బయటకు తీసారు. కొన్ని విగ్రహాలని బయటకు తీసిన తరువాత, వారి గణేశుడు బయటకు వచ్చింది. ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే, బంగారు గొలుసు ఇంకా గణేశుడి మెడలోనే సురక్షితంగా ఉంది.
గొలుసును తిరిగి పొందిన ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుంటూ, మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి ప్రజలు, చుట్టుపక్కల ఉన్న భక్తులు కూడా సిబ్బందిని అభినందించారు. “ఇది దేవుడి చల్లని కృపే.. అలాగే అధికారుల చొరవే ఈ గొలుసు తిరిగి దక్కించుకోవడానికి కారణం” అంటూ పలువురు స్పందించారు. ఇక ఈ రోజు వినాయక నిమజ్జనం(Vinayaka Immersion) సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర జరుగుతుండగా, మధ్యాహ్నం వరకు నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేయాలని భావిస్తున్నారు.