అక్షరటుడే, వెబ్డెస్క్ : Chevella bus accident | చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బస్సు ప్రమాదంలో వికారాబాద్ (Vikarabad) జిల్లా యాలాల మండలం పెర్కంపల్లి గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్ళు సాయి ప్రియ, నందిని, తనూష మృతి చెందిన విషయం తెలిసిందే. వారి తల్లిదండ్రులు ఎల్లయ్య గౌడ్ అంబికను కవిత పరామర్శించారు. పిల్లలను కోల్పోయిన బాధ మాటల్లో చెప్పలేనిదన్నారు.
Chevella bus accident | మెరుగైన వైద్యం అందించాలి
బస్సు ప్రమాదంలో గాయపడి చేవెళ్లలోని పీఎంఆర్ ఆసుపత్రి (PMR Hospital)లో చికిత్స పొందుతున్న బాధితులను కవిత పరామర్శించారు. వారి పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. NH-163 నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటి హయాంలో ఇటువంటి విషాదాలు జరిగినందున నిందలు వేయడం ఆపాలని హితవు పలికారు.
సురక్షితమైన రోడ్లను డిమాండ్ చేస్తున్న స్థానికులపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఈ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆలస్యం చేయకుండా రోడ్డుకు మరమ్మతులు చేయాలని కవిత డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున, గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు.
