అక్షరటుడే, వెబ్‌డెస్క్: Falcon Scam | ఫాల్కన్ కుంభకోణంలో కీలక పురోగతి చోటుచేసుకుంది. భారీ ఆర్థిక మోసానికి పాల్పడిన ఫాల్కన్ కంపెనీ ఎండీ అమర్‌దీప్‌ను ముంబయిలో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమిగ్రేషన్ అధికారుల ద్వారా అందిన సమాచారం మేరకు.. గల్ఫ్ నుంచి ముంబయికి వచ్చిన అమర్‌దీప్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు.
Falcon Scam | భారీ మొత్తంలో మోసం..
అమర్‌దీప్‌పై ఇప్పటికే లుక్అవుట్ సర్క్యులర్ (ఎల్ఏసీ) జారీ చేశారు. భారత్ ఆయన అడుగుపెట్టిన వెంటనే అధికారులు అప్రమత్తమై చర్యలకు ఉపక్రమించారు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో సుమారు రూ.850 కోట్ల మేర ప్రజల నుంచి వసూలు చేసి మోసగించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఎంఎన్సీ కంపెనీల్లో పెట్టుబడులు, యాప్ బేస్డ్ డిజిటల్ డిపాజిట్లు, షేర్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయంటూ ప్రజలను నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బలు కాజేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రావడంతో తన భార్యతో కలిసి అమర్దీప్ ఛార్టెడ్ విమానంలో దుబాయ్ పారిపోయాడు. ఈ కేసులో ఇప్పటికే ఫాల్కన్ కంపెనీ సీఈఓ, అమర్దీప్ సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అమర్‌దీప్‌ను కూడా అరెస్టు చేయడంతో కేసు దర్యాప్తు వేగవంతం కానుంది.