అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fake IPS | నకిలీ ఐపీఎస్ అధికారి (Fake IPS Officer)ని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఐపీఎస్ అధికారిని అని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఫిల్మ్‌నగర్ (Film Nagar)లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారినంటూ శశికాంత్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. ఇద్దరు గన్మెన్లను పెట్టుకుని బిల్డర్లను బెదిరిస్తున్నాడు. తాను స్పెషల్ ఆఫీసర్ అని చెప్పుకొని బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు. అలాగే ప్రభుత్వం నుంచి ప్రాజెక్ట్‌లు ఇప్పిస్తానని పలువురిని నమ్మించి వసూళ్లకు పాల్పడ్డాడు. అయితే ప్రాజెక్ట్‌లు ఇప్పించకపోగా.. డబ్బులు సైతం ఇవ్వకపోడంతో పలువురు బిల్డర్లు నిలదీశారు. సదరు నకిలీ ఐపీఎస్ అధికారి గన్మెన్లతో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతడు నకిలీ ఐపీఎస్ అధికారి అని గుర్తించారు. నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు.
Fake IPS | వాహనాలకు పోలీస్ సైరెన్లు
శశికాంత్ అరెస్ట్‌పై వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాసులు (DCP Srinivasulu) వివరాలు వెల్లడించారు. నిందితుడు ఇద్దరు బాడీగార్లను పెట్టుకుని మోసం చేశాడన్నారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు ఆయుధాలతో అతడి వెంట ఉండేవారని చెప్పారు. వాహనాలకు పోలీస్ సైరన్లతో పాటుగా వాకీటాకీలను పెట్టుకొని ఐపీఎస్ అధికారిగా నమ్మించాడన్నారు. టీఎస్ఐఐసీ (TSIIC)లో ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేశారు. గోల్డ్ జిమ్ ఓనర్ దగ్గర రూ.10 లక్షలు, సూపర్వైజర్ దగ్గర రూ.8 లక్షలు వసూలు చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసి, రెండు ఫోన్లో, వాకీ టాకీలు, నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Fake IPS | పెరిగిపోతున్న నకిలీ అధికారులు
దేశవ్యాప్తంగా ఇటీవల నకిలీ అధికారులు పెరిగిపోతున్నారు. తాము అధికారులం అని చెప్పుకొని చాలా మంది ప్రజలను మోసం చేస్తున్నారు. గతంలో రాష్ట్రంలో ఇలా మోసాలకు పాల్పడుతున్న చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ యువతి తాను కానిస్టేబుల్‌ను అని చెప్పుకొని విధుల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. జీడిమెట్ల (Jeedimetla)లోని షాపూర్‌నగర్‌కు చెందిన ఉమాభారతి డిగ్రీ సెకండియర్ చదువుతోంది. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రిపేర్ కాగా ఆమెకు కొలువు రాలేదు. అయితే పోలీసు ఉద్యోగంపై తనకున్న ఇష్టంతో యూనిఫాం కొనుక్కొని విధులు నిర్వహించింది. ఏకంగా వీఐపీ సమావేశాలకు బందోబస్తు నిర్వహించడంతో పాటు, సెక్రెటేరియట్, సైబరాబాద్ సీపీ కార్యాలయాల్లో మీటింగ్‌లకు సైతం హాజరైంది. అనంతరం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.