అక్షరటుడే, వెబ్‌డెస్క్: fake IAS officer arrested | ఐఏఎస్ (IAS) అధికారిగా చెప్పుకొంటూ సుప్రీంకోర్టు న్యాయవాదితో సహా ఎందరినో మోసగించి, ఆరేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న కేటుగాడు వివేక్ మిశ్రా ఎట్టకేలకు పట్టుబడ్డాడు. లక్నో పోలీసులు అతగాడిని అరెస్టు చేశారు.
సుప్రీంకోర్టు న్యాయవాది అశుతోశ్ మిశ్రా ఫిర్యాదు ఆధారంగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఓసారి పరిశీలిస్తే.. నిందితుడు వివేక్ మిశ్రా పలువురికి 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా పరిచయం చేసుకునేవాడు. గుజరాత్ సర్కారులో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నట్లుగా చెప్పుకొనేవాడు.
Fake IAS officer arrested | నిజమైన అధికారుల పేర్లు వాడుకుంటూ..
తన సిస్టర్స్ గుజరాత్ కేడర్ ఐపీఎస్ (IPS) అధికారులుగా నమ్మబలికేవాడు. వాట్సప్ గ్రూపులు, సోషల్ మీడియాల్లో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి.. అమ్మాయిలను టార్గెట్ చేసేవాడు.
అమ్మాయిలను ప్రేమ పేరుతో నమ్మించేవాడు. వారి కుటుంబీకులను సంప్రదించి సర్కారు కొలువులు ఇప్పిస్తానని ప్రలోభపెట్టి డబ్బులు లాగేవాడు. అతగాడిని పూర్తిగా నమ్మేలా నిజమైన ఐఏఎస్, ఐపీఎస్ల పేర్లను తన పేరుగా వాడుకున్నాడు.
2018 జూన్లో సుప్రీంకోర్టు Supreme Court న్యాయవాది అశుతోశ్ మిశ్రాకు ఈ మోసగాడైన వివేక్ పరిచయం అయ్యాడు. అశుతోశ్కు ప్రభుత్వ ఉద్యోగ ఇప్పిస్తానని నమ్మించాడు. గుజరాత్ Gujarat హోం మినిస్ట్రీలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, డిప్యూటీ ఎస్పీ (స్పోర్ట్స్ కోటా) పోస్టుల నియామక పత్రాలు కూడా ఇచ్చాడు.
ఆ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే నకిలీవి అని తేలింది. దీంతో 2019లో చిన్హాట్ పోలీస్ స్టేషన్లో అశుతోశ్ మిశ్రా ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు.. నిందితుడు వివేక్ మిశ్రాపై కేసు చేశారు.
దర్యాప్తును సీఐడీ (CID)కి ట్రాన్స్ఫర్ చేశారు. కాగా, నిందితుడు ఆరేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసుల దర్యాప్తులో వివేక్ ఇప్పటి వరకు 150 మందికి పైగా అమాయకులను మోసగించినట్లు తేలింది. వారి వద్ద నుంచి రూ.80 కోట్ల వరకు వసూలు చేసినట్లుగా తెలిసింది.
కాగా, నిందితుడి కోసం ఓ వైపు సీఐడీ అధికారులు వెతుకుతుంటే.. లక్నో పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండుకు తరలించారు.