HomeUncategorizedF-35 Fighter Jet | కేర‌ళ‌లోనే ఎఫ్‌-35బీ ఫైట‌ర్ జెట్‌.. ఎయిర్ లిఫ్ట్ చేసే ఆలోచ‌న‌లో...

F-35 Fighter Jet | కేర‌ళ‌లోనే ఎఫ్‌-35బీ ఫైట‌ర్ జెట్‌.. ఎయిర్ లిఫ్ట్ చేసే ఆలోచ‌న‌లో బ్రిట‌న్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:F-35 Fighter Jet | సాంకేతిక సమస్య తలెత్తడంతో కేరళ రాజ‌ధాని తిరువ‌నంతపురం విమానాశ్ర‌యం (Thiruvananthapuram Airport)లో అత్యవసరంగా ల్యాండయిన బ్రిటన్ ఫైట‌ర్ జెట్ ఎఫ్-35బీలో తీవ్ర లోపం ఉన్న‌ట్లు గుర్తించారు. హైడ్రాలిక్ వైఫ‌ల్యం(Hydraulic failure) త‌లెత్త‌డంతో ఇక్క‌డ మ‌ర‌మ్మ‌తులు చేసి త‌ర‌లించ‌డం కష్టంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఫైట‌ర్ జెట్‌ను ఎయిర్ లిఫ్ట్ (సైనిక కార్గో విమానంలో త‌ర‌లించే) చేసే అవ‌కాశ‌ముంద‌ని ఏఎన్ఐ వెల్ల‌డించింది. విమానాన్ని తిరిగి పున‌రుద్ధ‌రించ‌డానికి అతిపెద్ద నిర్వహణ బృందం వస్తుందని తెలిపింది. అవసరమైతే, ఫైట‌ర్ జైట్‌ను సైనిక రవాణా విమానంలో కూడా తిరిగి తీసుకెళ్లవచ్చని భావిస్తున్నారు.

F-35 Fighter Jet | ఆరు రోజులుగా ఇక్క‌డే..

బ్రిటీష్ నేవీలోని అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఎఫ్35బీ ఫైట‌ర్ జెట్(F35B fighter jet) జూన్ 14న తిరువ‌నంత‌పురంలో అత్యవ‌స‌రంగా ల్యాండ‌యింది(Emergency Landing). బ్రిటన్‌కు చెందిన హెచ్‌ఎమ్ఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఈ విమానాన్ని ఇండో పెసిఫిక్ ప్రాంతంలో మోహరించారు. ఇటీవల భారతీయ నేవీ(Indian Navy)తో కలిసి నావికాదళ విన్యాసాల్లో కూడా ఎఫ్35బీ పాల్గొంది. అయితే జూన్ 14న ఈ యుద్ధ విమానం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇంధనం తక్కువగా ఉన్నట్టు విమానంలో సంకేతాలు కనబడటంతో పైలట్ కేరళ ఏటీసీ అనుమ‌తితో ల్యాండింగ్ చేశారు. ఈ విష‌యాన్ని మరుసటి రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force) ధ్రువీకరించింది. అవసరమైన సాయం చేస్తామని ప్రకటించింది.

F-35 Fighter Jet | అత్యాధునిక టెక్నాల‌జీతో..

అమెరికా రూపొందించిన ఎఫ్‌35బీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన, అత్యాధునిక టెక్నాల‌జీతో రూపొందింది. మరే యుద్ధ విమానంలోనూ లేని ఆధునిక సాంకేతిక వ్యవస్థలు ఈ స్టెల్త్ జెట్ సొంతం. అంత ఖ‌రీదైన‌, అధునాత‌న టెక్నాల‌జీతో రూపొందించిన ఈ జెట్‌ను ఎయిర్‌పోర్టులో బ‌హిరంగంగానే పార్క్ చేసి ఉంచారు. ఈ జెట్‌‌ను తమ హ్యాంగర్‌లో (విమానం పార్కింగ్ ప్లేస్) నిలుపుకోవచ్చని ఎయిరిండియా ఆఫ‌ర్ చేయ‌గా, బ్రిటన్ నేవీ సున్నితంగా తిర‌స్క‌రించింది. తమకు మాత్రమే ప్రత్యేకమైన అత్యాధునిక సాంకేతికత ఎవరి చేతుల్లో పడొద్దన్న కారణంతోనే బ్రిటన్ నేవీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే, తాజాగా ఈ ఫైట‌ర్ జెట్లో త‌లెత్తిన హైడ్రాలిక్ వ్య‌వ‌స్థ లోపం కార‌ణంగా ఇక్క‌డ మ‌ర‌మ్మ‌తులు చేసే అవ‌కాశం లేద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డి నుంచి ఎయిర్‌లిఫ్ట్ చేయాల‌ని బ్రిట‌న్ నేవీ యోచిస్తున్న‌ట్లు ఏఎన్ ఐ వెల్ల‌డించింది.