అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lenskart Solutions IPO | కళ్లజోళ్ల తయారీ, మార్కెటింగ్‌లో తనదైన ముద్రవేసిన లెన్స్‌కార్ట్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. మార్కెట్‌నుంచి రూ. 7,278 కోట్లు సమీకరించనుంది. దేశంలోనే ఇది మొదటి ప్రత్యేక ఐవేర్ ఐపీవో.
2008లో స్థాపించబడిన లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్(Lenskart Solutions Ltd.).. ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలు, సన్ గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్‌లు (Contact Lenses) మరియు ఉపకరణాల రూపకల్పన, తయారీ, బ్రాండిరగ్, విక్రయాలలో తనదైన ముద్రవేసింది. ఇది భారతదేశంలో కళ్లజోళ్ల మార్కెట్‌నే మార్చివేసింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలు విక్రయించింది. వినియోగదారులకు నేరుగా కళ్లజోళ్లు అందించే మోడల్ కింద పనిచేస్తున్న ఈ కంపెనీ.. సొంత బ్రాండ్లు మరియు ఉపబ్రాండ్‌ల కింద విస్తృత శ్రేణి కళ్ల జోళ్లను అందిస్తోంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2,723 స్టోర్‌లను నిర్వహిస్తున్నట్లు డీఆర్‌హెచ్‌పీలో పేర్కొంది. ఇందులో భారతదేశంలో 2,067 స్టోర్లున్నాయి. దేశంలో 168 స్టోర్‌లలో మరియు జపాన్ (Japan) మరియు థాయిలాండ్‌తో సహా ఎంపిక చేసిన దేశాలలో 136 ఆప్టోమెట్రిస్టుల ద్వారా రిమోట్ కంటి పరీక్షలూ నిర్వహిస్తోంది.
లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఐపీవో (IPO) ద్వారా రూ. 7,278.02 కోట్లను సమీకరించనుంది. ఇందులో రూ. 2,150 కోట్లు ఫ్రెష్ ఇష్యూ (Fresh Issue) కాగా.. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్(OFS). ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని కొత్త కోకో స్టోర్ల ఏర్పాటుకోసం, ప్రస్తుతం నిర్వహిస్తున్న స్టోర్ల అద్దె ఒప్పందాల చెల్లింపుల కోసం, టెక్నాలజీ మరియు క్లౌడ్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడికి, బ్రాండ్ మార్కెటింగ్ మరియు వ్యాపార ప్రమోషన్ ఖర్చులతోపాటు ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Lenskart Solutions IPO | ప్రైస్‌బ్యాండ్..
కంపెనీ రూ. 2 ముఖ విలువ(Face value) కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 382 నుంచి రూ. 402 గా నిర్ణయించింది. ఒక లాట్(Lot)లో 37 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,874తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల కోసం బిడ్లు వేయవచ్చు.
Lenskart Solutions IPO | కోటా, జీఎంపీ..
క్యూఐబీలకు 75 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం కేటాయించిన కంపెనీ.. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 10 శాతం కోటానే ఇచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ (GMP) రూ. 70 గా ఉంది. అంటే లిస్టింగ్‌లో 17 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Lenskart Solutions IPO | కంపెనీ ఆర్థిక పరిస్థితి..
కంపెనీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,609.87 కోట్ల ఆదాయాన్ని(Revenue) ఆర్జించగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 7,009.28 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో రూ. 10.15 కోట్ల నష్టం నుంచి బయటపడి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 297.34 కోట్ల లాభాలను ఆర్జించింది. ఆస్తులు రూ. 9,531.02 కోట్లనుంచి రూ. 10,471.02 కోట్లకు పెరిగాయి.
గమనించాల్సిన తేదీలు..
ఐపీవో సబ్‌స్క్రిప్షన్(Subscription) ఈనెల 31న ప్రారంభమవుతుంది. వచ్చేనెల 4న ముగుస్తుంది. షేర్ల తాత్కాలిక అలాట్‌మెంట్ స్టేటస్ 5వ తేదీన రాత్రి వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ షేర్లు 7వ తేదీన బీఎన్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవనున్నాయి. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో విండో ఈనెల 30న అందుబాటులో ఉండనుంది.

