అక్షరటుడే, వెబ్డెస్క్ : Eye Care Clinic | రాష్ట్రవ్యాప్తంగా ఐకేర్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarasimha) శాసనమండలిలో ప్రకటించారు. ప్రజలకు కంటి వైద్య సేవలను చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం మండలిలో మంత్రి మాట్లాడారు. ఐకేర్ కినిక్ (ICare Clinic)ల నిర్వహణలో మెహదీపట్నంలోని సరోజినీ దేవీ కంటి ఆస్పత్రి ‘హబ్’గా వ్యవహరిస్తుందన్నారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్లలో 6,12,973 మందికి శుక్లాల ఆపరేషన్లు చేయించినట్లు మంత్రి వెల్లడించారు. 33.65 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు పరీక్షలు చేసి, 76,176 మందికి అద్దాలు పంపిణీ చేశామన్నారు.
Eye Care Clinic | ప్రభుత్వ బాధ్యత
ఆర్ఎంపీ, పీఎంపీ లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. పేదల ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. పల్లెల్లో సేవలు అందిస్తున్న సబ్ సెంటర్లు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులను జీజీహెచ్లకు అనుసంధానం చేస్తున్నామన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చేవారన్నారు. అయితే దీనిపై ఐఎంఏ కోర్టు (IMA Court)ను ఆశ్రయించడంతో శిక్షణ పెండింగ్లో ఉందన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
Eye Care Clinic | ప్రభుత్వ డాక్టర్లు ఉండటం లేదు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఉంటున్నారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) అన్నారు. అనంతరం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారని పేర్కొన్నారు. కొందరు ఆర్ఎంపీలు కార్పొరేట్ ఆస్పత్రుల దగ్గర కమీషన్లు తీసుకుని పేద రోగులను లూటీ చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రు (Government hospitals) లను బలోపేతం చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.