అక్షరటుడే, వెబ్‌డెస్క్: Medaram Jathara | మేడారం మహా జాతరకు కుంభమేళా స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. అభివృద్ధి పనులు 95 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు.
శాసనమండలిలో సోమవారం మంత్రి మాట్లాడారు. సమ్మక్క-సారలమ్మ జాతర (Sammakka-Saralamma Jatara) కోసం రూ.200 కోట్లకు పైగా విలువైన పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని చెప్పారు. వాటిలో దాదాపు 95 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ఈ పనులలో 200 సంవత్సరాలకు పైగా మన్నిక ఉండేలా రూపొందించిన రాతి కట్టడాలు, 10 కిలోమీటర్ల పరిధిలో నాలుగు వరుసల రహదారుల నిర్మాణం, 29 ఎకరాల భూసేకరణ వంటివి ఉన్నాయన్నారు. యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి అదనంగా మరో 63 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనవరి 29 నుంచి 31 వరకు జరగనున్న ఈ జాతర కోసం కుంభమేళాకు (Kumbh Mela) సమానమైన స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Medaram Jathara | 18న సీఎం రాక
మంత్రులు సీతక్క (Minister Seethakka), కొండా సురేఖతో (Minister Konda Surekha) కలిసి మేడారం పనులను పర్యవేక్షిస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 18న మేడారం వస్తారని చెప్పారు. పునరుద్ధరణ పనులను ఆయన ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
Medaram Jathara | చారిత్రక నేపథ్యం మేరకు..
మేడారం జాతర (Medaram Jathara) విశిష్టత, చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించి, గిరిజన, ఆదివాసీ పూజారుల సూచనల మేరకు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కావాలనే కొంతమంది నాయకులు, కొన్ని పత్రికలు గిరిజన ఆచారానికి విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుళ్ల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నది ఒడ్డున గల దేవాలయాలను ఆధునీకరించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి ప్రకటించారు.