అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medaram Jathara | మేడారం సామక్క–సారక్క జాతర కోసం ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. మహా జాతర సమీపిస్తుండటంతో భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టింది.
మేడారం (Medaram) జాతర జనవరి 28 నుంచి 31 వరకు సాగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే భక్తుల రద్దీ నెలకొంది. జాతర సందర్భంగా కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. గతంలో ప్రభుత్వాలు జాతరకు తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమే చేసేవి. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రతిష్టాత్మకంగా తీసుకొని శాశ్వత పనులకు నిధులు మంజురు చేశారు. ఇందులో భాగంగా చెక్కుచెదరకుండా నిలిచేలా గద్దెల శాశ్వత పునర్నిర్మాణం చేపట్టారు.
Medaram Jathara | రూ.251 కోట్లతో..
మొత్తం రూ.251 కోట్లతో మేడారం సమగ్ర అభివృద్ధి చేపట్టనున్నారు. ఇందులో గద్దెల విస్తరణకే రూ.101 కోట్లు కేటాయించారు. 4 వేల టన్నుల గ్రానైట్‌తో గద్దెల ప్రాంగణ నిర్మాణం చేశారు. 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించిన 7,000కి పైగా శిల్పాలు, 930 ఏళ్ల కోయల తాళపత్ర గ్రంథాల ఆధారంగా శిల్ప రూపకల్పన చేశారు. 46 స్తంభాలతో 271 చ.మీ విస్తీర్ణంలో ప్రాకారం నిర్మించారు.
Medaram Jathara | పూజారుల సంఘం ఆమోదంతో..
మేడారంలో 40 అడుగుల వెడల్పుతో 3 స్వాగత తోరణాలు, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు, 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణం పనులు సాగుతున్నాయి. చెట్లను తొలగించకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. బండారి, మర్రి, వెదురు, వేప, ఇప్ప తదితర 12 రకాల పవిత్ర వృక్షాలు అక్కడ ఉన్నాయి. పూజారుల సంఘం ఆమోదంతోనే అన్ని పనులు చేపట్టారు. భక్తుల కోసం మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మిస్తున్నారు. అలాగే రోడ్లు సైతం వేస్తున్నారు.