అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pakistan | పాకిస్థాన్‌లో మరోసారి పేలుడు చోటు చేసుకుంది. రైలును లక్ష్యంగా చేసుకొని ఐఈడీ బాంబును (IED bomb) పేల్చారు. ఈ ఘటనలో రైలు పట్టాలు తప్పగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
బలోచిస్థాన్ రెబల్స్ జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును (Jafar Express train) లక్ష్యంగా చేసుకొని మంగళవారం దాడికి పాల్పడ్డారు. పాకిస్థాన్‌లోని సింధ్-బలూచిస్తాన్ సరిహద్దుకు (Sindh-Balochistan border) సమీపంలోని సుల్తాన్‌కోట్ ప్రాంతం సమీపంలో క్వెట్టాకు వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను పేల్చడానికి వేర్పాటువాదులు యత్నించారు. రైలు పట్టాలపై ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) అమర్చి పేల్చేశారు. దీంతో రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ దాడికి తామే కారణం అంటూ బలూచ్ రెబల్ గ్రూప్, బలూచ్ రిపబ్లిక్ గార్డ్స్ ప్రకటించాయి.
Pakistan | అందుకే..
జూన్‌లో సైతం జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని బాంబు దాడి జరిగింది. మార్చిలో ఈ రైలును బలోచ్ ఉగ్రవాదులు హైజాక్ (hijack) చేశారు. అందులోని వందలాది మందిని కిడ్నాప్ చేశారు. వారిని విడిపించడానికి వెళ్లిన సైనికులను సైతం హతమార్చారు. దీంతో పాక్ ఆర్మీ (Pakistan Army) ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి బందీలను విడిపించింది. కాగా బలోచ్ తీవ్రవాదులు తరచూ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడటం వెనక కారణం ఉంది. ఇందులో ఎక్కువగా సైనికులు ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం కూడా పాకిస్థాన్ ఆర్మీ సిబ్బంది రైలులో ప్రయాణిస్తుండటంతో దీనిని లక్ష్యంగా చేసుకున్నట్లు వారు ప్రకటించారు.
Pakistan | దాడులు కొనసాగుతాయి
పాక్ ఆర్మీ సిబ్బంది రైలులో ప్రయాణిస్తున్న సమయంలో దాడి జరిగిందని బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. పేలుడు ధాటికి అనేక మంది సైనికులు మరణించారని, చాలా మంది గాయపడ్డారని పేర్కొంది. బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం వచ్చే వరకు ఇలాంటి దాడులు కొనసాగుతాయని పేర్కొంది. కాగా పేలుడు సమాచారం అందగానే భద్రతా బలగాలు, సహాయక బృందాలు (rescue teams) ఘటన స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను అధికారులు ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రాణ నష్టంపై పాక్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.