అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Medicover Hospitals | నిత్యం వ్యాయామం.. సమతుల ఆహారంతోనే గుండె పదిలంగా ఉంటుందని అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి (Additional DCP Baswareddy) అన్నారు. నగరంలోని మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సోమవారం 2కే వాక్ నిర్వహించారు.
ఈ వాక్ రుక్మిణి ఛాంబర్స్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయన్నారు. చిన్న వయస్సులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ (Heart Problems) రావడం ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ తమ రోజువారీ జీవితంలో వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. ఇలాంటి వాక్‌లు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ఉపయోగపడతాయన్నారు. ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మెడికవర్ హాస్పిటల్స్(Medicover Hospital)ను అభినందించారు.
Medicover Hospitals | ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించవద్దు..
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సదానంద రెడ్డి మాట్లాడుతూ గుండె సంబంధిత సమస్యలు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. హెల్త్ చెకప్స్ చేయించుకోవడం.. బరువు నియంత్రణ, వ్యాయామం చేయడంతో పాటు జంక్ ఫుడ్, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.
Medicover Hospitals | ఫిజికల్ యాక్టివిటీ తగ్గడంతో..
కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ రావు మాట్లాడుతూ ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, రాత్రి నిద్రలేమి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల యువతలో హృద్రోగ సమస్యలు పెరుగుతున్నాయన్నారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం, పండ్లు–కూరగాయలు తీసుకోవడం, తగినంత నీరు తాగడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో కార్డియాలజిస్టులు డాక్టర్ జగదీష్ చంద్ర బోస్, డాక్టర్ వారిస్ అలీ, ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.