అక్షరటుడే, వెబ్డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ వీడటం లేదు. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినా.. ఎన్నికలు జరుగుతాయా.. లేదా అనే ఆందోళన నెలకొంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోకు వ్యతిరేకంగా మాధవరెడ్డి అనే వ్యక్తి ఇప్పటికే హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 8కి విచారణను వాయిదా వేసింది. ఈ లోపే ఎన్నికల సంఘం (Election Commission) ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే షెడ్యూల్ వెలువడినా.. విచారణ చేపడుతామని కోర్టు స్పష్టం చేసింది. తాజాగా మరో వ్యక్తి బీసీ రిజర్వేషన్ల (BC Reservations)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
Local Body Elections | 6వ తేదీకి వాయిదా
బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేశారు. 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడం చట్ట విరుద్ధమని ఆయనప పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం సోమవారానికి (ఈ నెల 6వ తేది) వాయిదా వేసింది. దీంతో రిజర్వేషన్లపై కోర్టులు ఎలాంటి తీర్పు ఇస్తాయోనని పోటీ చేయాలనుకునే ఆశావహులు, ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉండగా జీవో ఎలా జారీ చేస్తారని ఇప్పటికే హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
Local Body Elections | రద్దు చేస్తే ఎలా..
రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మూడు దశల్లో సర్పంచ్ ఎలక్షన్లు పెడతామని తెలిపింది. ఈ నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ రోజు నుంచి తొలిదశ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు కూడా స్వీకరిస్తారు. అయితే కోర్టులు ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తే ఎలా అనే ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఆయా స్థానాలకు రిజర్వేషన్ ఖరారు చేశారు. ఆ ప్రకారం ఆశావహులు గ్రామాల్లో పోటీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
ఒక వేళ కోర్టులు 42 శాతం రిజర్వేషన్ చెల్లదని తీర్పు ఇస్తే.. మొత్తం రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. దీంతో చాలా మంది పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు సందిగ్ధంలో పడిపోయారు. అయితే నోటిఫికేషన్ వెలువడటానికి ముందే సుప్రీంకోర్టు, హైకోర్టులో విచారణ ఉండటంతో ఆలోపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.