అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ex mla jajala surendhar | కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు ‘సేవ్ ఎల్లారెడ్డి’ నినాదంతో మున్సిపల్ ఎన్నికల (Municipal elections) బరిలోకి వెళ్తున్నామని స్థానిక మాజీ ఎమ్మెల్యే జాజాల (Former MLA Jajala) సురేందర్ ప్రకటించారు. ఎల్లరెడ్డి పట్టణంలోని తన ఫామ్‌హౌస్‌లో బుధవారం బీఆర్ఎస్ మున్సిపల్ అభ్యర్థుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు.
Ex mla jajala surendhar | ఎల్లారెడ్డిని రక్షించుకోవాలి..
ఈ సందర్భంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు దఫెధర్ రాజు(Dafedar Raju)తో కలిసి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఎల్లారెడ్డిని (Yellareddy) కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి రక్షించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తన హయాంలో మంజూరైన అభివృద్ధి పనులు తామే మంజూరు చేయించినట్లు స్థానిక శాసనసభ్యులు గొప్పలు చెప్పుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. వంద పడకల ఆస్పత్రికి రూ.19 కోట్లు, పట్టణంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలకు రూ.50 కోట్లు, పెద్ద చెరువు కట్టపై బ్రిడ్జిలకు రూ.5 కోట్లు, చిల్డ్రన్స్ పార్కుకు రూ.కోటిన్నర, డబుల్ బెడ్రూమ్లకు రూ.18 కోట్లు, పెద్దచెరువు కట్టపై అభివృద్ధికి రూ.4 కోట్లు, ఆర్టీసీ బస్టాండ్‌కు రూ.5 కోట్లు తన హయాంలో మంజూరయ్యాయని వివరించారు. వీటన్నిటికీ సంబంధించిన జీవో కాపీలను జాజాల ప్రదర్శించారు.
Ex mla jajala surendhar | మున్సిపల్ ఎన్నికల నుంచి తప్పుకుంటాం..
ఈ పనులన్నీ తానే చేసినట్లు పేర్కొంటూ స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని జాజాల ధ్వజమెత్తారు. తన హయాంలో మంజూరైనట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు జీవో కాపీలు చూపించాలన్నారు.
వాటిని చూపిస్తే ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల బరిలో నుంచి తమ పార్టీ అభ్యర్థులందర్నీ తప్పిస్తామని ఆయన సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరించి స్థానిక పోచమ్మ గుడికి ఎమ్మెల్యే వస్తే.. తమ నాయకులు వస్తారని ఆయన పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులు ఏమయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. ఎల్లారెడ్డి చరిత్ర ఎమ్మెల్యేకు తెలియదని ఎద్దేవా చేశారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై పనిచేసిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని గుర్తుచేశారు.
తాడూరి బాలాగౌడ్..
స్థానిక నాయకుడు దివంగత తాడూరి బాలా గౌడ్(Taduri Bala Goud) బీసీ సంఘం అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ ఛైర్మన్, ఎమ్మెల్యేగా, ఎంపీ, మంత్రిగా పనిచేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారన్నారు. దివంగత సదాలక్ష్మి, ఈశ్వరి బాయ్ మంత్రులుగా పని చేశారని గుర్తుచేశారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేరెళ్ల ఆంజనేయులు క్యాబినెట్ ర్యాంకులో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారని వివరించారు. ఇక్కడ వ్యాపారులు దివంగత ముస్త్యాల వెంకటరామయ్య స్వాతంత్య్రానికి పూర్వమే ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు ఏర్పాటు చేయడంతో పాటు కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటి ప్రీమియర్ టాకీస్‌ను నిర్మించారని కొనియాడారు. ముప్పిడి నారాయణ, ముత్యపు రాఘవులు, వంగపల్లి నాగభూషణం వంటి వ్యాపారులు జిల్లాలోనే పేరు గాంచారని చెప్పారు.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్, బోధన్ తర్వాత ఎల్లారెడ్డి మున్సిపాలిటీగా ఉండేదని, మొట్టమొదటి మున్సిపల్ ఛైర్మన్‌గా మైసన్ వకీల్ పనిచేశారని వివరించారు. వీరి గురించి ఎమ్మెల్యేకు ఎలాంటి చరిత్ర తెలియదని, అందుకే ఎల్లారెడ్డి వెనుకబడిన ప్రాంతమని ఎప్పుడూ అంటారని ఆయన విమర్శించారు.
ఎమ్మెల్యేగా ఎన్నికై రెండున్నరేళ్లు అవుతున్నా ఇక్కడి వారి విషయాలు తెలియదని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవినీతిని అడ్డుకోవాలంటే తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు జలంధర్ రెడ్డి, కాసాల శ్రీనివాస్ రెడ్డి, ఎగుల నర్సింలు, ఆదిమూలం సతీష్, మనోహర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ముదాం సాయిలు, రాజేశ్వర్, కపిల్ రెడ్డి తోపాటు వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.