అక్షరటుడే, కామారెడ్డి: Ex MLA Gampa Govardhan | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body elections) మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నాయకులకు సూచించారు. పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
Ex MLA Gampa Govardhan | కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly election) ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికలు వస్తుండటంతోనే హడావిడిగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) ఇస్తామంటూ మరోసారి దొంగనాటకానికి తెర లేపారన్నారు. అసెంబ్లీ తీర్మానం చేసిన తరువాత ఆర్డినెన్స్ చేసినా చెల్లుతుందని మేధావులు చెబుతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని తెలిపారు.
Ex MLA Gampa Govardhan | కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్..
కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్(BC Declaration) పేరుతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో (Karnataka CM Siddaramaiah) మాట్లాడించారని, ఆ హామీనే మర్చిపోయారని విమర్శించారు. సర్పంచ్, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు వేరువేరుగా పెట్టినా.. ఒకేసారి పెట్టినా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. నాయకులు గ్రామాలు, మండలాల వారిగా కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేయాలన్నారు.
Ex MLA Gampa Govardhan | తులం బంగారం ఏమైంది..?
కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారని, పింఛన్ రూ.4 వేలకు పెంచుతామని మోసపూరిత హామిలిచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఇవన్నీ ప్రజలకు వివరించాలని సూచించారు. స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయి ఏళ్ళు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించడం లేదని కోర్టు మొట్టికాయ వేస్తే ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, నాయకులు గోపిగౌడ్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.