అక్షరటుడే, బాన్సువాడ : Banswada | ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి కిందపడి మృతి చెందిన విద్యార్థిని సంగీత కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Pocharam Srinivas Reddy) తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో సోమవారం విద్యార్థిని మృతికి సంతాపం ప్రకటించారు. బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో (Social Welfare Residential School) 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సంగీత ప్రమాదవశాత్తు ఆటో నుంచి జారి పడి మృతి చెందిన విషయం తెలిసిందే.
Banswada | రాష్ట్ర ప్రభుత్వం తక్షణసాయం..
ఈ ఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్యే పోచారం తెలిపారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందన్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం (CM Office) నుంచి సమాచారం అందిందన్నారు. త్వరలోనే ఈ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేస్తామన్నారు. విద్యార్థిని మృతికి సంతాపం తెలిపిన వారిలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub Collector Kiranmayi) ఉన్నారు.
Banswada | విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేయిస్తాం..
విద్యార్థిని సంగీత మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి మృతికి గల కారణాలపై విచారణ చేసి బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంబంధిత ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ, ఆమెపై శాఖాపరమైన చర్యలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నామన్నారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. విచారణ అనంతరం మరెవరైనా బాధ్యులుగా తేలితే వారిపై కూడా చర్యలు తప్పవని వెల్లడించారు.