అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం (ECI) ఢిల్లీలో మంగళవారం పలు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్ బీఆర్ఎస్ తరఫున కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఈవీఎం(EVM)లను తొలగించి, తిరిగి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు.
KTR | ఆ గుర్తులు తొలగించాలి
ఎన్నికల సమయంలో కారును పోలిన దాదాపు 8, 9 గుర్తులతో బీఆర్ఎస్కు నష్టం కలుగుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో తమ పార్టీ భువనగిరిలో ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందన్నారు. కానీ కారు గుర్తును పోలిన రోడ్ రోలర్ గుర్తుకు ప్రచారం చేయకుండానే 27 వేల ఓట్లు వచ్చాయని ఆయన చెప్పారు. ఇలా తమ పార్టీకి ఎన్నో సార్లు జరిగిందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 14 సీట్లు 6 వేల ఓట్లతో ఓడిపోయినట్లు ఆయన చెప్పారు. ఆ గుర్తులను తొలగించాలని ఈసీని కోరామన్నారు.
KTR | బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) బీసీలను మోసం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. బీసీలకు ఏడాదికి రూ.20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని, బీసీ సబ్ ప్లాన్, బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా రిజర్వేషన్లు ఇస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇందులో బీసీ రిజర్వేషన్లు (BC Reservations) తప్ప మిగతావన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయొచ్చన్నారు. అయితే తమ చేతిలో ఉన్నవి చేయకుండా రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం నిరసనల పేరిట డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు బడ్జెట్లు పెట్టిందని.. బీసీలకు ఎందుకు నిధులు కేటాయించలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు బీసీలను మోసం, దగా చేసి ధర్నా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | కాళేశ్వరం నివేదిక ట్రాష్
కాళేశ్వరం కమిషన్ నివేదిక (Kaleshwaram Commission Report)పై కేటీఆర్ స్పందించారు. ఆ నివేదిక మొత్తం గ్యాస్.. ట్రాష్ అన్నారు. ఉద్దేశపూర్వకంగా కేసీఆర్, బీఆర్ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి నివేదికను బయట పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
