అక్షరటుడే, ఇందూరు: Ura panduga | ఊరంతా మెచ్చే ఊర పండుగ వచ్చేసింది.. అమ్మను కొలిచేందుకు ఇందూరు సర్వసమాజం సన్నద్ధమైంది. జిల్లా కేంద్రంలో (Nizamabad City) ఏటా ఆషాడ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం ఊరపండుగను ఘనంగా జరుపుకుంటారు. ఆషాఢ మాసం అంటేనే తెలంగాణలోని (Telangana) అన్ని జిల్లాల్లో బోనాల సందడి నెలకొంటుంది. కానీ ఇందూరులో మాత్రం భిన్నంగా గ్రామదేవతల ఊరేగింపు నిర్వహిస్తారు. దేవతలను ఊరు నలుమూలల ప్రతిష్ఠించి భక్తితో కొలుస్తారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేకంగా తయారుచేసిన ‘సరి’ని చల్లుతూ.. ఊర పండుగ ఘనంగా నిర్వహిస్తారు.
Ura panduga | ఏడు దశాబ్దాలుగా వస్తోన్న ఆనవాయితీ..
సాధారణంగా ఆషాఢమాసం (Ashada masam) అంటేనే వర్షాకాలం. ఈ కాలంలో అనేక అంటూ వ్యాధులు ప్రబలుతాయి. అయితే 16వ శతాబ్దంలో హైదరాబాద్‌లో (Hyderabad) ప్లేగు వ్యాధి (Plague disease) సోకి అనేకమందికి మరణించారు. అలాగే 76 ఏళ్ల క్రితం ఇందూరులోనూ అంటువ్యాధులు వ్యాప్తించాయి. దీంతో ఆనాటి పెద్దలు కమిటీగా ఏర్పడి గ్రామ దేవతలను కొలుస్తూ, పసుపుతో ప్రత్యేకంగా ‘సరి’ తయారుచేసి ప్రతి ఇంటిపై చల్లారు. ఇక అప్పటినుంచి ఆనవాయితీగా ఇందూరులో ఊర పండుగను నిర్వహిస్తున్నారు. అన్ని కుల సంఘాలు సర్వ సమాజ్ కమిటీగా (Sarva Samaj Committee) ఏర్పడి ప్రతి ఏడాది గ్రామ దేవతల ఊరేగింపు కొనసాగిస్తున్నారు. పాడి.. పంటలు సమృద్ధిగా ఉండాలని, ప్రజలంతా ఆరోగ్యంతో జీవించాలని దేవతలను కొలుస్తారు.
Ura panduga | ప్రతియేటా దేవతల తయారీ..
ఊర పండుగ కోసం ప్రతి ఏడాది దేవతలను తయారుచేస్తారు. నగరంలోని అశోక్ వీధి నకాష్ గల్లీలో ఉన్న వడ్లధాతి ప్రాంతంలో 13 దేవతామూర్తులను నిష్టతో తయారుచేస్తారు. ఊర పండుగకు ఐదురోజుల ముందు బండారు పోస్తారు. ఆ మరుసటి రోజు నుంచి వడ్రంగి కులస్తులు ఉపవాసంతో మామిడి కర్ర (చెక్క)తో దేవతామూర్తులను తయారుచేస్తారు.
ఇందులో మహాలక్ష్మి, మత్తడి పోచమ్మ, ఐదు చేతుల పోచమ్మ, అంపుడు పోచమ్మ, కొండల రాయుడు, బోగన్సాని, సార్గలమ్మ, పౌడాలమ్మ, పెద్దమ్మ, అడెల్లి పోచమ్మతో పాటు ఆసు, రాట్నంలను చెక్కుతారు. అలాగే వీటికి మేదరి కులస్తులు తొట్లేను, కుమ్మరిలు సరి, గాండ్ల కులస్తులు నూనె, మేరు కులస్తులు వస్త్రాలు, స్వర్ణకారులు నగలను అందజేస్తారు. అందుకే అన్ని కులాలను కలిపి సర్వ సమాజ్ కమిటీగా ఏర్పాటు చేశారు.
Ura panduga | దేవతల ఊరేగింపు..
ఇందూరుకే తలమానికంగా ఉన్న ఖిల్లా శారదాంబా గద్దె నుంచి దేవతలను ఊరేగింపుగా తరలిస్తారు. గాజుల్పేట్, పెద్ద బజార్, గోల్ హనుమాన్, వినాయక్ నగర్, మహాలక్ష్మి నగర్ వరకు దేవతల ఊరేగింపు కొనసాగుతుంది. అలాగే పెద్ద బజార్ నుంచి నెహ్రూపార్క్, గంజ్ మీదుగా దుబ్బ వరకు మరో శోభాయాత్ర కొనసాగుతుంది. ఇలా నగరం నలుమూలల దేవతలను ప్రతిష్ఠిస్తారు. అలాగే గంజ్‌లోని హమాలీ సంఘం వారు తొట్టెలను ఊరేగిస్తారు.
Ura panduga | ‘సరి’ కోసం పోటీ..
ఊర పండుగలో ’సరి’కి ప్రత్యేక స్థానం ఉంటుంది. కుమ్మరి కులస్తులు దీనిని తయారుచేస్తారు. శనివారం అర్ధరాత్రి జొన్న గట్కా, పసుపు, బియ్యం, మేక పేగులు, రక్తంతో తయారుచేసి ఖిల్లా వద్దకు తరలిస్తారు. ఆషాఢ మాసం మూడో ఆదివారం అక్కడి నుంచి గాజుల్ పేట్లో ప్రత్యేక పూజలు చేసి గ్రామ దేవతలతో పాటు ఊరంతా తిరుగుతూ ఇళ్లపై.. భక్తులపై చల్లుతారు. అయితే ఈ సరిని దక్కించుకోవడం కోసం భక్తులు పోటీపడతారు. పండుగ సందర్భంగా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది.

వంశపారపర్యంగా వస్తోంది..
– రవీందర్, గ్రామదేవతల తయారీదారు (వడ్రంగి)
మా తాతల నుంచి ఊర పండుగ కోసం దేవతామూర్తులను తయారు చేస్తున్నాం. ప్రతి ఏడాది ఉపవాసం ఉంటూ మామిడి కర్రతో దేవతలను తయారు చేస్తాం. మొత్తం 13 దేవతామూర్తులను సర్వ సమాజ్ కమిటీకి అందజేస్తాం. వంశపారపర్యంగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం.