HomeజాతీయంBihar Assembly Elections | బీహార్ పోలింగ్‌కు స‌ర్వం సిద్ధం.. 6న తొలి విడత ఎన్నిక‌లు

Bihar Assembly Elections | బీహార్ పోలింగ్‌కు స‌ర్వం సిద్ధం.. 6న తొలి విడత ఎన్నిక‌లు

బీహార్​లో తొలి దశ పోలింగ్ గురువారం జరగనుంది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాలలో మొదటి దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar Assembly Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు (Bihar Assembly Elections) సర్వం సిద్ధ‌మైంది. గురువారం (నవంబర్ 6) తొలి దశ పోలింగ్ జరగనుంది. అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, మహాఘట్ బంధన్ (Mahaghat Bandhan) అధికారం చేజిక్కించుకోవాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది.

రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాలలో మొదటి దశ పోలింగ్ జరుగుతుంది. దాదాపు 3.75 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1,314 మంది అభ్యర్థులు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. ప్ర‌చారం ప‌రిస‌మాప్తం కావ‌డంతో మైకులు మూగ‌బోయాయి. ఇన్నాళ్లు ప్ర‌చార హ‌డావుడిలో ఉన్న నేత‌లు.. ఓట‌ర్ల‌కు ప్ర‌లోభాల‌ను ఎర‌వేసే కార్య‌క్ర‌మంపై దృష్టి సారించారు.

Bihar Assembly Elections | కూట‌ముల మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ..

మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా, నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. బీజేపీ, జేడీ(యూ) నేతృత్వంలోని ఎన్డీయే ఒక‌వైపు, ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) నేతృత్వంలోని మ‌హాఘ‌ట్‌బంధ‌న్ కూట‌మి అయిన కాంగ్రెస్, దీపాంకర్ భట్టాచార్య నేతృత్వంలోని సీపీఐ (ఎంఎల్), సీపీఐ, సీపీఎం, ముఖేష్ సహానీకి చెందిన వికాశీల్ ఇన్సాన్ పార్టీలతో (వీఐపీ) కూడిన మ‌రో కూట‌మి అధికారం కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి. కొత్తగా బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) పార్టీ జన్ సురాజ్ కూడా రాష్ట్రంలోని 243 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టారు. అయితే, ఎన్డీయే, మ‌హాఘ‌ట్ బంధ‌న్ కూటముల మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ నెల‌కొంది.

Bihar Assembly Elections | ప్ర‌లోభాల ప‌ర్వం..

తొలి విడత ఎన్నిక‌లు జ‌రుగుతున్న 121 నియోజ‌క‌వ‌ర్గాల్లో మంగ‌ళ‌వారం సాయంత్రంతోనే ప్ర‌చారం ముగిసింది. దీంతో మైకులు మూగ‌బోయాయి. ఇన్నాళ్లు ప్ర‌చారంలో బిజీగా గ‌డిపిన నేత‌లు.. ఓట‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. మందు, మాంసం, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌తో పాటు న‌గ‌దు వెద‌జ‌ల్లుతున్నారు. ఒక్కో ఓటుకు రూ.1000 నుంచి రూ.2 వేల వ‌ర‌కు పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిసింది. అన్ని పార్టీలు ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. విచ్చ‌ల‌విడిగా మ‌ద్యం పంపిణీతో పాటు న‌గ‌దు పంపిణీ కూడా చేప‌ట్టాయి. కొన్నిచోట్ల వ‌స్తువులు, కానుక‌లు, చీర‌లు వంటివి పంచి పెట్టారు.