అక్షరటుడే, వెబ్డెస్క్: PCC Chief Mahesh Goud | హైదరాబాద్లోని గాంధీభవన్లో (Gandhi Bhavan) ఆదివారం కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ జెండా ఎగురవేశారు.
పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. దేశంలో శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) అన్నారు. నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయంటే రాజీవ్ గాంధీ నాడు తీసుకున్న నిర్ణయాలే కారణం అన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని నాటి కాంగ్రెస్ ప్రధానులు ముందు చూపుతో నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. వారు నాడు తీసుకొచ్చిన సంస్కరణలతో నేడు దేశం టెక్నాలజీలో దూసుకు పోతుందని చెప్పారు.
PCC Chief Mahesh Goud | పీవీ ఆర్థిక సంస్కరణలు
తెలంగాణకు చెందిన పీవీ నర్సింహారావు (PV Narasimha Rao) ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని మహేశ్ గౌడ్ అన్నారు. బంగారం తాకట్టు పెట్టి దేశాన్ని నడిపే స్థితి నుంచి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారన్నారు. ఆర్థికంగా ప్రపంచంతో భారత్ పోటీ పడేలా చేశారని కొనియాడారు. గ్రామాల్లో వలసలు నిరోధించడానికి సోనియా గాంధీ ఆకాంక్ష మేరకు మన్మోహన్ సింగ్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చారన్నారు. కానీ మోదీ ప్రభుత్వం పేద ప్రజలకు ఉపయోగపడే ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. మహత్మా గాంధీ పేరు తొలగించడంతో పాటు కార్యక్రమాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.