అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cyber Warriors | సైబర్ నేరాలు నిరోధించేందుకు ప్రతి పోలీస్ అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగు పర్చుకోవాలని సీపీ సాయి చైతన్య (CP Sai chitanya) పిలుపునిచ్చారు. నగరంలోని పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్ రూంలో (Police Commissioner Command Control Room) బుధవారం సైబర్ వారియర్స్‌కు సైబర్ నేరాలు.. నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సైబర్ వారియర్స్‌ను ఉద్దేశించి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతి పోలీస్ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. దీని కోసమే నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
Cyber Warriors | ప్రతి కేసును సీరియస్‌గా తీసుకోవాలి..
ప్రతి కేసును సీరియస్‌గా తీసుకుని బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని సీపీ సూచించారు. ఫిషింగ్, వేరియంట్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాలు వంటి నూతన పద్ధతులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ సెల్‌ను బలోపేతం చేయాలని, ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ నేరాలపై నిపుణులుగా ఏర్పడాలని సూచించారు. 1930నంబర్, https://www.cybercrime.gov.in ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
అనంతరం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సైబర్ వారియర్స్‌కు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Telangana Cyber Security Bureau), హైదరాబాద్ వారి టీ షర్ట్స్ అందిoచారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ మహమ్మద్ ముఖిద్ పాషా, ఏఎస్సైలు ప్రవళిక, శ్రీనివాస్, శ్రీరామ్, సురేష్, నాగభూషణం, నరేష్, ప్రవీణ్, రాఘవేంద్ర, సుమలత, శృతి, రమ్య, తదితరులు పాల్గొన్నారు.