HomeజాతీయంGST collections | రేటు తగ్గినా.. జోరు తగ్గని జీఎస్టీ వసూళ్లు.. అక్టోబర్‌లోనూ రికార్డుస్థాయిలో కలెక్షన్లు

GST collections | రేటు తగ్గినా.. జోరు తగ్గని జీఎస్టీ వసూళ్లు.. అక్టోబర్‌లోనూ రికార్డుస్థాయిలో కలెక్షన్లు

వస్తు, సేవల పన్నులో (జీఎస్టీ) సంస్కరణలు తీసుకువచ్చినా.. సర్కారు ఆదాయం మాత్రం తగ్గలేదు. గతనెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. పండుగ కొనుగోళ్లు కలిసి వచ్చాయని భావిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST collections | దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు మరోసారి చరిత్ర సృష్టించాయి. కేంద్రప్రభుత్వం (Central Government) సంస్కరణలు తీసుకువచ్చి జీఎస్టీ రేట్లు తగ్గించినా.. పండుగ సీజన్‌లో కొనుగోళ్ల జోరుతో అక్టోబర్‌లో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు శనివారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఇదే నెలలో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయ్యింది. ఈ ఏడాది అక్టోబర్‌లో 4.6 శాతం వృద్ధి నమోదయ్యింది.

GST collections | కలిసొచ్చిన ధరల తగ్గింపు..

ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు (GST Reforms) ప్రవేశపెట్టి గతంలో ఉన్న నాలుగు శ్లాబ్‌లలో రెండింటిని రద్దు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న 12, 28 శాతం శ్లాబ్‌లను రద్దు చేసిన సర్కారు.. వాటిని 5, 18 శాతం శ్లాబ్‌లలో సర్దుబాటు చేసింది. కొన్నింటిపై పూర్తిగా జీఎస్టీని ఎత్తేసింది. విలాసవంతమైన పలు వస్తువులపై సెస్‌ను కూడా రద్దు చేసింది. కిచెన్‌ వస్తువులు, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ (Automobile) సహా 375 ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గించింది. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్‌ 22 నుంచి అమలులోకి వచ్చాయి. ఆయా వస్తువుల ధరలు తగ్గడం, ఇదే సమయంలో దసరా నవరాత్రులు, దీపావళి పండుగ (Festivals) రావడంతో ప్రజలు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు.

దీంతో జీఎస్టీ వసూళ్లు (GST Collections) సైతం పెరిగాయి. గతేడాది అక్టోబర్‌ నెలలో ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో రూ. 1.87 లక్షల కోట్ల ఆదాయం సమకూరగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో అది 1.96 లక్షల కోట్లకు పెరిగింది. అంతకుముందు నెలలో (సెప్టెంబర్‌) జీఎస్టీ వసూళ్లు రూ. 1.89 లక్షలు కోట్లుగా నమోదైన విషయం తెలిసిందే. వరుసగా పదో నెలలోనూ రూ. 1.8 లక్షల కోట్లపైనే జీఎస్టీ వసూళ్లు నమోదు కావడం గమనార్హం. అక్టోబర్‌ నెల మొత్తం వసూళ్లలో రూ. 1.45 లక్షల కోట్లు దేశీయ వినియోగానికి సంబంధించినవి కాగా.. దిగుమతులపై సుంకాల ద్వారా రూ. 50,884 కోట్లు సమకూరాయి. ఇందులోంచి జీఎస్టీ రీఫండ్స్‌ రూ. 26,934 కోట్లు మినహాయిస్తే నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.69 లక్షల కోట్లుగా ఉన్నాయి.