అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Malreddy Ranga Reddy | తాను మంత్రి పదవి (Minister Post) రేసులో ఉన్నట్లు ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన అసెంబ్లీ వద్ద మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) పరిధిలో కాంగ్రెస్ నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి మాత్రమే గెలుపొందారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయితే ఇటీవల మంత్రివర్గ విస్తరణలో ఆయన అవకాశం లభించలేదు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకాటి శ్రీహరికి అవకాశం కల్పించారు. దీంతో మల్‌రెడ్డి అలక బూనగా మంత్రి శ్రీధర్‌బాబు, పీసీసీ అధ్యక్షుడు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు.
Malreddy Ranga Reddy | ఆయనకు ఇస్తే ఓకే..
హైదరాబాద్, రంగారెడ్డి నుంచి మంత్రి పదవి ఎవరికి ఇవ్వలేదు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మంత్రి గణేశ్ గెలిచారు. అయితే సీనియర్ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వాలని మల్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఒకవేళ తనకు ఇవ్వకపోతే మైనారిటీ కోటాలో అజారుద్దీన్‌కు (Azharuddin) ఇస్తే తనకు ఇబ్బంది లేదన్నారు. కాగా.. అజారుద్దీన్‌ను ప్రభుత్వం ఇటీవల ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో సీఎంతో సహా మొత్తం 18 మంది మంత్రులు ఉండొచ్చు. ప్రస్తుతం 15 మంది ఉన్నారు. ఇంకో మూడు పదవులు భర్తీ చేయొచ్చు. దీంతో తనకు అవకాశం వస్తుందని మల్‌రెడ్డి ఆశిస్తున్నారు. మరో విడత విస్తరణలో తనకు పదవి ఇవ్వాలని, లేదంటే అజారుద్దీన్‌కు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
Malreddy Ranga Reddy | జూబ్లీహిల్స్ టికెట్ బీసీలకు ఇవ్వాలి
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల మృతి చెందారు. దీంతో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఆ స్థానం నుంచి టికెట్ ఆశించిన అజారుద్దీన్‌ను కాంగ్రెస్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ (MLC) చేయనుంది. దీంతో ఆ టికెట్‌ను బీసీలకు ఇవ్వాలని మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందో చూడాలి. స్థానికంగా పని చేస్తున్న వారికే టికెట్ ఇస్తామని గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.