అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం ఉదయం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.
కొన్ని రోజులుగా కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఫార్ముల ఈ కారు రేస్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో ఆయనను అదుపులోకి తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై తాజాగా కేటీఆర్ స్పందిస్తూ.. మున్సిపల్ ఎన్నికలకు తనను లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. తాను లోపల ఉన్నా.. పార్టీ చూసుకుంటుందని చెప్పారు. బెదిరింపులకు తాను భయపడనని వ్యాఖ్యానించారు.
KTR | వారిని మళ్లీ తీసుకోం
పార్టీ వదిలి వెళ్లిన నేతలను మళ్లీ తీసుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)ని కాదని బీజేపీలోకి వెళ్లిన నేతల నియోజకవర్గాల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలిచి సత్తా చాటామన్నారు. నేతల బలం లేకున్నా బీఆర్ఎస్ కార్యకర్తలు సర్పంచులను గెలిపించుకున్నారని చెప్పారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీలో డోర్స్ క్లోజ్ అయ్యాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టు ఉందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch Elections) బీఆర్ఎస్ పార్టీకి 40శాతం ఫలితాలు వచ్చాయని తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి భయం మొదలైందని, అందుకే మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) పెట్టడం లేదన్నారు.
KTR | ఏ పార్టీలో ఉన్నారో..
ఫిరాయింపు ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని గతి పట్టిందని కేటీఆర్ అన్నారు. కాగా పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. వీరిలో ఐదుగురి అనర్హత పిటిషన్లను ఇటీవల స్పీకర్ కొట్టివేశారు. వారు బీఆర్ఎస్లోనే ఉన్నట్లు తెలిపారు. మిగతా వారి విచారణ పెండింగ్‌లో ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో (Assembly Sessions) ఫిరాయింపు ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ వైపు, ఇటు బీఆర్ఎస్ వైపు కూర్చొలేదు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల సంజయ్ ట్రెజరీ బెంచీల వైపు కూర్చున్నారు.