అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pre Marital Counseling | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహ సంబంధ సమస్యల పరిష్కారం కోసం పెళ్లికి ముందే కౌన్సెలింగ్ ఇవ్వడానికి ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ (PMC) సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ యుగంలో వివాహం అనంతరం దంపతుల మధ్య అనేక సమస్యలు వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడంతో చిన్న చిన్న విషయాలకే జంటలు విడిపోతున్నాయి. ఈ క్రమంలో పెళ్లి బంధంలో పెరుగుతున్న సమస్యలకు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివాహ పూర్వ కౌన్సెలింగ్ (PMC) కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ఫైల్‌పై మంత్రి సీతక్క (Minister Seethakka) శుక్రవారం సంతకం చేశారు. దీంతో త్వరలోనే కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
Pre Marital Counseling | జిల్లాకు ఒకటి..
ప్రస్తుతం యువత చాలా విషయాల్లో రాజీ పడటం లేదు. చిన్న చిన్న కారణాలతో కట్టుకున్న వారిని వదిలి పెట్టడానికి కూడా వెనకాడటం లేదు. మహిళా కమిషన్, సఖీ సెంటర్లకు (Sakhi Centers) ఇటీవల వివాహ సంబంధ ఫిర్యాదులు పెరిగాయి. అభిప్రాయ భేదాలు, అవగాహన లోపంతో సమస్యలు వస్తున్నాయి. దీంతో వివాహ బంధంలో అడుగుపెట్టే ముందు దంపతులకు బాధ్యతలను, పరస్పర గౌరవాన్ని అర్థం చేసుకునేలా కౌన్సెలింగ్ ఇవ్వడానికి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున 33 కౌన్సెలింగ్ సెంటర్లను (Counseling Centers) ఏర్పాటు చేయనున్నారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాగానే.. వీటిలో సిబ్బందిని నియమించి కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.
Pre Marital Counseling | అక్కడ ఏర్పాటు
పీఎంసీ సెంటర్లను ప్రస్తుతానికి సఖీ, వన్ స్టాప్ సెంటర్లలో ఏర్పాటు చేయనున్నారు. అనంతరం అవసరం అయితే సొంత భవనాలు నిర్మించనున్నారు. ఈ కేంద్రంలో లీగల్ కౌన్సెలర్, సైకాలజిస్టు, సోషల్ వర్కర్, హెల్పర్ ఉంటారు. వివాహానికి ముందే పెళ్లి తర్వాత వచ్చే సమస్యలపై వీరు అవగాహన కల్పిస్తారు. వాటిని ఎలా అధిగమించాలో చెబుతారు. వీటి నిర్వహణ, సిబ్బంది జీతాల కోసం ఏడాదికి రూ.5 కోట్ల వరకు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు.