అక్షరటుడే, ఇందూరు: Nizamabad Municipal Corporation | కార్పొరేషన్ పరిధిలో ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులను పూర్తిగా సవరించాలని అన్ని పార్టీల జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని నగర పాలక సంస్థ కార్యాలయంలో (municipal corporation office) సోమవారం ఆయా పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు.
Nizamabad Municipal Corporation | ఓట్లు తారుమారయ్యాయి..
ప్రధానంగా డివిజన్ల వారీగా విడుదల చేసిన జాబితాలో ఇతర డివిజన్లో ఓటర్లు ఉండడాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని డివిజన్లో వేలల్లో ఓట్లు గల్లంతయ్యాయని, ఇతర జిల్లాల ఓట్లు వచ్చాయని వాపోయారు. అలాగే కొన్ని డివిజన్లో పాత ఇంటి నంబర్ ప్రకారం ఓట్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం కొత్త ఇంటి నంబర్ ప్రకారం ఇతర డివిజన్లోకి వెళ్లిపోయాయని తెలిపారు. ఇలా అన్ని సమస్యలను కచ్చితంగా పరిష్కరించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని స్పష్టం చేశారు.
Nizamabad Municipal Corporation | పదో తేదీలోపు పరిష్కరిస్తాం..
కమిషనర్ దిలీప్ కుమార్ (Commissioner Dileep Kumar) స్పందిస్తూ.. ఈనెల 10వ తేదీలోపు సమస్యలన్నింటినీ పరిష్కరించి, నూతన జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి సమస్యను ఎన్నికల సంఘం (Election Commission) దృష్టికి తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari), కాంగ్రెస్ నాయకుడు నరాల రత్నాకర్, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, ఎంఐఎం, తెలుగుదేశం, సీపీఎం, ఆప్ నాయకులు పాల్గొన్నారు.
Nizamabad Municipal Corporation | బీజేపీ.. ఎంఐఎం ఆందోళన..
సమావేశం చివరలో బీజేపీ.. ఎంఐఎం పార్టీల నాయకులు పోటాపోటీ నినాదాలు చేశారు. నగరాన్ని ఇందూరుగా పిలవాలని బీజేపీ ఆందోళన నిర్వహించగా.. నిజామాబాద్ పేరే ఉండాలంటూ ఎంఐఎం నాయకులు నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.