అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ernakulam Express | విశాఖపట్నం జిల్లా దువ్వాడ Duvvada మార్గంలో ప్రయాణిస్తున్న ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైల్లోని ప్యాంట్రీ కారుకు సమీపంలో ఉన్న B1, M2 ఏసీ బోగీల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎలమంచిలి సమీపంలోని ఓ పాయింట్ వద్ద లోకో పైలట్లు పొగను గమనించి అప్రమత్తమై రైలును వెంటనే స్టేషన్లో నిలిపివేశారు.అయితే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోపు మంటలు వేగంగా వ్యాపించి రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగ కారణంగా రైల్లో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై, తమ బోగీల నుంచి బయటకు పరుగులు తీశారు.
Ernakulam Express | తీవ్ర విషాదం..
ఈ విషాద ఘటనలో B1 బోగీలో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) సజీవ దహనమై మృతి చెందారు. ఆయన మృతితో ఘటన మరింత విషాదకరంగా మారింది. ప్రమాదం నేపథ్యంలో ఎలమంచిలి రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతం మొత్తం పొగతో నిండిపోయింది. ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌కు Ernakulam Express జరిగిన ప్రమాదం వల్ల ఈ మార్గంలో రైలు రాకపోకలు అస్తవ్యస్తమయ్యాయి. విశాఖ నుంచి విజయవాడ దిశగా వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, అనకాపల్లి, విశాఖ, తుని రైల్వేస్టేషన్లలో కొన్ని రైళ్లు నిలిచిపోయాయి.
ఇదిలా ఉండగా, దగ్ధమైన రెండు బోగీల్లోని ప్రయాణికులను సామర్లకోట రైల్వేస్టేషన్‌కు మూడు ఆర్టీసీ బస్సుల్లో RTC Buses సురక్షితంగా తరలించారు. అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ ప్రమాదంలో కొందరికి స్వల్ప గాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది. ఈ ఘటన రైలు ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళనను కలిగించింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రైల్వే భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.