అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఏనుగు రవీందర్ రెడ్డి (Enugu Ravinder Reddy) కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సర్పంచ్ ఎన్నికల్లో ఇతర పార్టీలకు సహకరించారని, ఆయన అసలు ఏ పార్టీలో ఉన్నారో తేల్చుకోవాలని మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి (Pocharam Bhaskar Reddy) అన్నారు. బాన్సువాడలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Banswada | 111 మంది సర్పంచ్‌లు కాంగ్రెస్ మద్దతుదారులే..
బాన్సువాడ నియోజకవర్గంలో 137 గ్రామ పంచాయతీలకు (Gram Panchayats) ఎన్నికలు జరుగగా 111 మంది పోచారం శ్రీనివాస్ రెడ్డి మద్దతుగా నిలబెట్టిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందారని వివరించారు. ఏనుగు రవీందర్ రెడ్డి మద్దతుగా నిలబెట్టిన వారిలో 16 మంది సర్పంచులు మాత్రమే గెలుపొందారని పేర్కొన్నారు. దీంతో నియోజవర్గంలో ఏనుగు ప్రభావం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి సొంత గ్రామంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఓడిపోయారని అన్నారు.
Banswada | నియోజకవర్గంలో..
రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేనివిధంగా 40మంది సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని పేర్కొన్నారు. బీర్కూర్‌లో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే ఏనుగు రవీందర్ రెడ్డి వెళ్లి సన్మానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులకు ఏనుగు రవీందర్ రెడ్డి సహకరించారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇతర పార్టీలకు సహకరిస్తున్న ఏనుగు ఏ పార్టీలో ఉన్నారో తేల్చుకోవాలని ప్రశ్నించారు. ఏనుగు రవీందర్ రెడ్డిని బాన్సువాడ నియోజకవర్గంకు వెళ్లవద్దని అధిష్టానం ఆదేశించినా ఏ ముఖం పెట్టుకొని బాన్సువాడకు వస్తున్నారని ప్రశ్నించారు. పోచారం బలపర్చిన గెలుపొందిన సర్పంచులు ప్రజలకు సహకరిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ఎర్వల కృష్ణారెడ్డి, మోహన్ నాయక్, ఎజాజ్, పిట్ల శ్రీధర్, జంగం గంగాధర్, లింగం, ఉదయ్, శ్రీనివాస్, పాషా తదితరులు పాల్గొన్నారు.