అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ODI Cricket | వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ జట్టు కొత్త అధ్యాయాన్ని లిఖించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 342 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా ప్రపంచ రికార్డు(World Record) సృష్టించింది.
ఇప్పటివరకు ఈ రికార్డు భారత్ పేరిట ఉండగా, ఇప్పుడు అది ఇంగ్లాండ్(England) ఖాతాలో చేరింది. మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 50 ఓవర్లలో 414 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. జాకోబ్ బెథెల్ 110 పరుగులతో ఆకట్టుకోగా, జో రూట్ సెంచరీతో (100 పరుగులు) సత్తా చాటాడు. చివర్లో జోస్ బట్లర్ 32 బంతుల్లో 62 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కి గట్టి ముగింపు ఇచ్చాడు.
ODI Cricket | భాకీ తేడాతో..
భారీ స్కోరుని చేజ్ చేసే క్రమంలో సౌతాఫ్రికా జట్టు(South Africa Team) కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయింది. జోఫ్రా ఆర్చర్ నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. సఫారీ బ్యాటర్లలో ఎనిమిది మంది పది పరుగుల మార్క్‌ను దాటలేకపోయారు. ఈ విజయం ద్వారా ఇంగ్లాండ్, 2023లో భారత్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసింది. భారత్(India) అప్పట్లో శ్రీలంకపై 317 పరుగుల తేడాతో గెలిచి ఈ ఘనత సాధించింది. ఇప్పటివరకు వన్డేల్లో 300కు పైగా పరుగుల తేడాతో విజయం సాధించిన జట్లు గమనిస్తే:
- 342 పరుగులు – ఇంగ్లండ్ (దక్షిణాఫ్రికాపై)
- 317 పరుగులు – భారత్ (శ్రీలంకపై)
- 309 పరుగులు – ఆస్ట్రేలియా (నెదర్లాండ్స్‌పై)
- 304 పరుగులు – జింబాబ్వే (యూఎస్ఏపై)
- 302 పరుగులు – భారత్ (శ్రీలంకపై)
భారత్ మాత్రమే వన్డే చరిత్రలో రెండు సార్లు 300కు పైగా పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించిన ఏకైక జట్టుగా నిలిచింది. ఈ ఘన విజయం ద్వారా ఇంగ్లాండ్, గ్లోబల్ క్రికెట్‌లో తన దూకుడు చూపించిందనే చెప్పాలి. వన్డే ఫార్మాట్‌లో ఇది గేమ్‌చేంజింగ్ మూమెంట్‌గా నిలవనుంది. ఇంగ్లండ్ జట్టు టెస్ట్ క్రికెట్‌లో కూడా ఇలాంటి దూకుడు ప్రదర్శిస్తుంది. అయితే ఇది కొన్ని సార్లు వర్కవుట్ అవుతున్నా, మరి కొన్ని సార్లు మాత్రం నిరాశపరుస్తుంది.