అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | నగరం (Hyderabad)లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ స్థలాల్లో చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తోంది.
మేడ్చల్ (Medchal) మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో ఆదివారం తెల్లవారుజామున హైడ్రా ఆపరేషన్ (Hydraa Operation) చేపట్టింది. ఇక్కడ 300 ఎకరాల్లో పలువురు కబ్జాలకు పాల్పడ్డారు. ఈ మేరకు హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. కబ్జాలు జరిగింది నిజమేనని నిర్ధారించుకొని ఆదివారం పెద్ద ఎత్తున సిబ్బంది, జేసీబీలతో రంగంలోకి దిగింది. 300 ఎకరాలకు పైగా భూమిని కబ్జా నుంచి విడిపించింది. రూ.15 వేల కోట్ల విలువైన ఈ భూమి చుట్టూ కంచె వేయనున్నట్లు అధికారులు తెలిపారు. నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణలు తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు.
Hydraa | ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన భూమి
గాజులరామరంలోని సర్వే నంబర్ 307 లో భూమిని ప్రభుత్వం గతంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించింది. అయితే ఈ భూమి ఖాళీగా ఉండటంతో కొందరు బడా బాబుల కన్ను పడింది. దానిని ఆక్రమించి షెడ్లు వేశారు. అంతేగాకుండా పలు ఎకరాల్లో వెంచర్లు వేసి ప్లాట్లుగా మార్చి విక్రయించారు. దీంతో హైడ్రా ఆదివారం షెడ్లను తొలగించింది. పేదవారిని ముందు పెట్టి.. బడాబాబులు వేయించిన షెడ్లు తొలగించినట్లు అధికారులు తెలిపారు.
Hydraa | బాధితుల ఆందోళన
గాజులరామారంలో ఆక్రమణలను తొలగింపు సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాము డబ్బులు పెట్టి ఇళ్లు కొనుగోలు చేసినట్లు బాధితులు వాపోయారు. తమ ఇళ్లు కూల్చొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇళ్లు అమ్మని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ పిల్లలతో కలిసి జేసీబీలకు అడ్డుగా వెళ్లి నిరసన తెలిపారు. అయితే హైడ్రా సిబ్బంది పోలీసుల సాయంతో వారికి పక్కకు తప్పించి కూల్చివేతలు చేపట్టారు.