అక్షరటుడే, వెబ్డెస్క్ : Jharkhand | జార్ఖండ్‌లో తీవ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. పలము జిల్లాలో (Palamu District) గురువారం నిషేధిత తృతీయ సమ్మేళన్ ప్రస్తుతి కమిటీ (TSPC), సీపీఐ (మావోయిస్ట్) చీలిక సంస్థ సభ్యుల కదలికల గురించి సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ ప్రారంభించారు.
ఈ క్రమంలో తారసపడిన తీవ్రవాదులు (Terrorists) పోలీసులపై కాల్పులు జరుపగా, వారు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. తప్పించుకుపోయిన తీవ్రవాదుల కోసం గాలిస్తున్నారు.
Jharkhand | తప్పించుకున్న శశికాంత్ గంజు
తృతీయ సమ్మేళన్ ప్రస్తుతి కమిటీ కమాండర్ శశికాంత్ గంజు (Commander Shashikant Ganju) ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ (Search Operation) ప్రారంభించారు. అతడి తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. “పాలములోని మనతు ప్రాంతంలో TSPC కమాండర్ శశికాంత్ గంజు కోసం పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులకు, నిషేధిత తీవ్రవాద సంస్థ తృతీయ సమ్మేళన్ ప్రస్తుతి కమిటీ సభ్యులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారని” జార్ఖండ్ పోలీసు ఆపరేషన్స్ & IG మైఖేల్‌రాజ్ S వెల్లడించారు.
గాయపడిన జవానును మెదినిరై మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారని చెప్పారు. “భద్రతా బృందం సంఘటనా స్థలానికి చేరుకోగానే, తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బందికి బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని వెంటనే మెదినిరై మెడికల్ కాలేజీ ఆసుపత్రికి (Medinirai Medical College Hospital) తరలించారు. అక్కడ వారిలో ఇద్దరు మరణించారని వైద్యులు ప్రకటించారు. గాయపడిన పోలీసు చికిత్స పొందుతున్నాడు” అని వివరించారు.