అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jharkhand | జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో (Gumla district) శనివారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పల్లో ముగ్గురు నక్సలైట్లు హతమయ్యారని పోలీసులు తెలిపారు. నక్సలైట్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న ఘాగ్రా ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. నక్సల్స్ ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో వారు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తాము కూడా ఫైరింగ్ ప్రారంభించామని చెప్పారు. పరస్పర కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారన్నారు. హతమైన వారు నిషేధిత CPI (మావోయిస్ట్)లో చీలిక గ్రూపు అయిన జార్ఖండ్ జన ముక్తి పరిషత్ (Jharkhand Jan Mukti Parishad) సభ్యులుగా గుర్తించారు. ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని, అది ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని జార్ఖండ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) మైఖేల్ ఎస్ రాజ్ వెల్లడించారు.
తిరుగుబాటుదారుల కదలికల గురించి నిఘా సమాచారం రావడంతో జార్ఖండ్ పోలీసులు (Jharkhand Police), CRPF సిబ్బందితో సహా భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో నక్సల్స్ కాల్పులు జరిపారు. సుదీర్ఘంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు తిరుగుబాటుదారులు చనిపోగా, భద్రతా దళాల వైపు నుండి ఎటువంటి ప్రాణనష్టం జరగదు.
Jharkhand | వరుస ఎన్‌కౌంటర్లు..
వరుస ఎన్‌కౌంటర్లలో నక్సల్స్ కు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. జూలై 16న, గోమియా పోలీస్ స్టేషన్ (Gomia police station) పరిధిలోని బిర్హోర్దేరా అడవిలో జరిగిన ఆపరేషన్‌లో కీలక మావోయిస్టు నేత హతమయ్యాడు. ఈ కాల్పుల్లో ఓ CRPF జవాన్ కూడా మరణించారు. మావోయిస్టు అని తప్పుగా భావించిన ఒక పౌరుడు కూడా ఎదురుకాల్పుల్లో మరణించాడు. బొకారో జిల్లాలో (Bokaro district) మరో ఘోరమైన కాల్పుల సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత శనివారం తాజాగా మరో ఎన్‌కౌంటర్ జరిగింది. వామపక్ష తీవ్రవాదం ద్వారా ఎక్కువగా ప్రభావితమైన జార్ఖండ్ రాష్ట్రంలో నక్సల్ హింస వల్ల కలిగే ప్రమాదాలను బొకారో ఎన్‌కౌంటర్ హైలైట్ చేసింది. బొకారో ఆపరేషన్‌లో మరణించిన మావోయిస్టును సీనియర్ క్యాడర్‌గా గుర్తించారు. అతని మరణం ఈ ప్రాంతంలో పనిచేస్తున్న తిరుగుబాటు సంస్థకు ఎదురుదెబ్బగా చెబుతున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న నక్సలైట్ల పోరాటాన్ని అణచివేసేందుకు భద్రతాబలగాలు ఇటీవలి కాలంలో ఉద్ధృతంగా కూంబింగ్ నిర్వహిస్తోంది. జార్ఖండ్ పోలీసులు, కేంద్ర పారామిలిటరీ దళాలు రాష్ట్రవ్యాప్తంగా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేశాయి.