అక్షరటుడే, వెబ్డెస్క్ : Operation Akhal | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. జమ్మూకశ్మీర్లోని కుల్గాం (Kulgam) జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారనే సమచారం మేరకు బలగాలు శుక్రవారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
ఈ క్రమంలో శనివారం ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు పాల్పడ్డాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. అనంతరం ఆదివారం సైతం కూంబింగ్ (Coombing) చేపట్టగా.. జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతం అయ్యారు. ఈ ఘటనలో ఒక జవాన్ గాయపడ్డారు. బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.
Operation Akhal | డ్రోన్లతో గాలింపు
కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల జాడ కోసం బలగాలు సాంకేతికతను వినియోగిస్తున్నాయి. డ్రోన్‌లు, థర్మల్ ఇమేజింగ్ పరికరాలను ఉపయోగించి టెర్రరిస్టుల కోసం అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కాల్పులు చోటు చేసుకున్నాయి. భారీ సంఖ్యలో బలగాలను అక్కడికి రప్పించారు. సెర్చ్ ఆపరేషన్ (Search Operation) ముమ్మరం చేయడంతో ఆపరేషన్ అఖల్లో ఇప్పటి వరకు ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఈ ఆపరేషన్లో భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సభ్యులు పాల్గొన్నారు.
Operation Akhal | ఉగ్రవాదుల ఆట కట్టిస్తున్న బలగాలు
జమ్మూ కశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత బలగాలు టెర్రరిస్టుల పని పడుతున్నాయి. ఏప్రిల్ 22న ఈ ఘటన చోటు చేసుకోగా.. అప్పటి నుంచి ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇటీవల ఆపరేషన్ మహదేవ్ (Operation Mahadev) చేపట్టి పహల్గామ్ దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టు బెట్టాయి. పహల్గామ్ దాడి జరిగిన తర్వాత బలగాలు ఇప్పటి వరకు 17 మంది ఉగ్రవాదులు ఎన్కౌంటర్లలో హతం అయ్యారు. ఆపరేషన్ అఖల్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.