అక్షరటుడే, కామారెడ్డి: Yellareddy Mla | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తున్నానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. ఐటీ కంపెనీల ఏర్పాటుతో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో రూ.2.40 కోట్ల నిధులతో మిషన్ భగీరథ బల్క్ నీటి కనెక్షన్ నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సకల సదుపాయాలతో టీజీఐఐసీని ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. నియోజకవర్గానికి ఇప్పటికే ఒక కంపెనీని తీసుకొచ్చానని, అది కూడా వచ్చే నెలలో ప్రారంభం కాబోతుందన్నారు. మరిన్ని కంపెనీలతో కూడా మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. ఈ కంపెనీలు రావడం వల్ల నియోజకవర్గంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఎన్నో సార్లు జాబ్ మేళాలు పెట్టి యువతకు ఉపాధి కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రభుత్వంతో చర్చించి కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు రూ.23 కోట్ల నిధులను విడుదల చేయించానని తెలిపారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ నిర్మాణ పనుల్లో భాగంగా భూంపల్లి, మోతే, కాటేవాడి జలశయాల నిర్మాణాలకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్లతో మాట్లాడి పెండింగ్‌లో ఉన్న నిధులు క్లియరెన్స్ చేయించామన్నారు. ఆర్థిక శాఖ నుంచి ఫైనల్ అప్రూవల్ వస్తే జలాశయాల నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వంతో మాట్లాడతానని, రైతుల వివరాలు నివేదిక తయారు చేసి వారం రోజుల్లో అందించాలని తహశీల్దార్‌కు సూచించారు.