అక్షరటుడే, వెబ్‌డెస్క్: Eluru District | ఏలూరు జిల్లాలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఎనిమిదేళ్ల ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లిన ఓ జంటపై, పరువు పేరిట యువతి కుటుంబ సభ్యులు అమానుషంగా దాడి చేసిన ఘటన ముసునూరు మండలం (Musunuru Mandal) రమణక్కపేటలో వెలుగుచూసింది.
ఈ ఘటన ప్రేమ వివాహాలపై ఇంకా సమాజంలో ఉన్న కఠిన దృక్పథాన్ని మరోసారి బయటపెట్టింది. మండవల్లి మండలం కానుకొల్లు గ్రామానికి చెందిన కుందుల సాయిదుర్గ రమణక్కపేట (Ramanakkapeta) ఉప తపాల కార్యాలయంలో పోస్టు ఉమెన్‌గా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన పల్లం సాయి చంద్‌తో ఆమె గత ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉంది. సుదీర్ఘ కాలంగా కొనసాగిన ఈ బంధం ఇద్దరూ ఒకరిపై ఒకరు ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచింది. అయితే కుల, కుటుంబ కారణాలతో ఇరు కుటుంబాలు ఈ వివాహానికి అంగీకరించలేదు. దీంతో ప్రేమను గెలిపించుకోవాలనే సంకల్పంతో గత మంగళవారం ఏలూరులోని గంగానమ్మ ఆలయంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.
Eluru District | సంతోషం క్షణాల్లోనే విషాదంగా ..
వివాహానంతరం తమ ఆనందాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఈ జంట, పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా (Social Media)లో పోస్టు చేసింది. ఇదే ఘటనకు మంటలు రాజేసిన కారణంగా తెలుస్తోంది. తమ అభిప్రాయాన్ని లెక్కచేయకుండా పెళ్లి చేసుకోవడమే కాకుండా, ఫొటోలను బహిరంగంగా పెట్టడంపై యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పెళ్లి జరిగిన మరుసటి రోజు బుధవారం, సాయి చంద్ రమణక్కపేట పోస్టాఫీసు వద్ద ఉన్న సమయంలో యువతి తల్లిదండ్రులు, బంధువులు ఒక్కసారిగా అతడిపై దాడికి పాల్పడ్డారు. స్థానికులు చూస్తుండగానే అతడిని ఓ స్తంభానికి కట్టేసి కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో సాయి చంద్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అదే సమయంలో సాయిదుర్గను బలవంతంగా కారులో ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
ఈ ఘటనలో ప్రేమ జంట మాత్రమే కాకుండా, సంబంధం లేని మరో ఉద్యోగి కూడా బాధితురాలిగా మారింది. చెక్కపల్లి బ్రాంచ్ పోస్టాఫీసులో పనిచేస్తున్న చెన్నకేశ్వరి అనే ఉద్యోగిని, ఈ పెళ్లికి సహకరించిందన్న అనుమానంతో యువతి బంధువులు చితకబాదారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగిపై జరిగిన ఈ దాడి పోస్టల్ శాఖ (Postal Department) సిబ్బందిలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.తీవ్రంగా గాయపడిన సాయి చంద్, చెన్నకేశ్వరిని స్థానికులు నూజివీడు ఏరియా ఆసుపత్రి (Nuzvid Area Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ కేసులో పోలీసుల వైఫల్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి అనంతరం తమకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని సాయి చంద్ ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయినప్పటికీ మరుసటి రోజే ఇంతటి ఘోర దాడి జరగడం పోలీసుల నిఘా లోపాన్ని స్పష్టంగా చూపుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.