అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Case | అక్రమాస్తుల కేసులో ఏసీబీ (ACB) అధికారులు విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్ (ADE Ambedkar)ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన అక్రమాస్తులకు సంబంధించి వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్‌లో గల టీజీఎన్పీడీసీఎల్ (TGNPDCL)లో సహాయక డివిజనల్ ఇంజినీరు (ఆపరేషన్స్)గా ఇరుగు అంబేడ్కర్ పని చేస్తున్నారు. ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. ఆయనతో పాటు అతని బంధువులకు సంబంధించిన 11 ప్రదేశాలలో సోదాలు చేపట్టారు. ఏకకాలంలో తనిఖీలు చేపట్టిన అధికారులు అంబేడ్కర్ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు.
ACB Case | అక్రమాస్తుల చిట్టా..
ఏడీఈ అంబేడ్కర్‌కు హైదరాబాద్ (Hyderabad)లోని ప్రముఖ ప్రదేశాలలో ఒక ఇల్లు, ఒక భవనం (G+5), 6 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలోని పెన్‌పహాడ్‌లో 10 ఎకరాల భూమిలో ఒక రసాయన కంపెనీ (ఆంథర్ కెమికల్స్) కూడా ఉంది. బంగారు ఆభరణాలు, రెండు కార్లు ఆయన పేరిట ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ శివారులో వెయ్యి గజాల భూమి ఉంది. అంతేగాకుండా ఆయన బినామీ సంతోష్ ఇంట్లో 2.18 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంబేడ్కర్ అక్రమాస్తుల విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.300 కోట్లు పైనే ఉంటుందని సమాచారం. ఏడీఈ అంబేడ్కర్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.
ACB Case | వారిలో కలవరం
ఏసీబీ అధికారులు ఇటీవల దూకుడు పెంచారు. ట్రాప్ కేసులతో పాటు అక్రమాస్తులపై ఫోకస్ పెట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా కూడబెట్టిన ఉద్యోగుల భరతం పడుతున్నారు. దీంతో అవినీతి అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తమ బండారం బయట పడుతుందోనని భయపడుతున్నారు. ఆస్తులను బంధువుల పేరిట మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.