అక్షరటుడే, వెబ్డెస్క్ : Electric vehicles | రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (electric vehicles) కొనుగోళ్లను ప్రోత్సహిస్తోంది. కాలుష్యం తగ్గించడానికి వీటిని వినియోగించాలని సూచిస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారికి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ రుసుములను (road tax and registration fees) 100 శాతం మినహయిస్తూ 2024 నవంబర్ ప్రభుత్వం జీవో తెచ్చింది. 2026 డిసెంబర్ 31 వరకు ఇది అమలులో ఉండనుంది. ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, ఈ-ఆటోలు, ట్యాక్సీలు, ట్రాక్టర్లు, బస్సులకు ఈ మినహాయింపు వర్తిస్తుందని గతంలో ప్రభుత్వం పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. జీవో 41 కారణంగా ఒక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు 1.59 లక్షలు దాటాయి.
Electric vehicles | రూ.806 కోట్ల సబ్సిడీ
జీవో 41 కారణంగా 1,59,304 వాహనాలకు రూ. 806.35 కోట్ల విలువైన ఈవీ సబ్సిడీ మద్దతు లభించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. ఈ ఏడాది జులైలో సైతం ప్రభుత్వం మరో జీవో విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ జీవో తీసుకొచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు ప్రత్యేక ప్రోత్సహకాలు ఇచ్చింది. ప్రభుత్వ విభాగాల్లో సైతం 20 శాతం ఈవీలను వినియోగించే దిశగా చర్యలు చేపట్టింది.
Electric vehicles | ఆ పరిస్థితి రావొద్దంటే..
ఢిల్లీలో కాలుష్యం పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్కు రాకుండా చర్యలు చేపట్టామన్నారు. అందుకే జీవో 41 తెచ్చినట్లు చెప్పారు. రాయితీలతో ప్రభుత్వంపై భారం పడుతున్నా.. కాలుష్యం తగ్గించడానికి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ వెలుపల పెరుగుతున్న కొత్త కాలనీలను దృష్టిలో పెట్టుకునొ జీవో 263 తెచ్చామన్నారు. అందులో భాగంగా 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు, 10 వేల సీఎన్జీ ఆటోలు, 10 వేల ఎల్పీజీ ఆటోలు, 25 వేల రెట్రో ఫీటెడ్ ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతి ఇచ్చామన్నారు. విద్యుత్ వాహనాలకు సరిపడా చార్జింగ్ స్టేషన్లు, ఇతర వసతులు కల్పిస్తామన్నారు.