Nizamabad City
Nizamabad City| ఖర్చు ఘనం.. వెలగని విద్యుత్​ దీపం..

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నిజామాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్​ పరిధిలోని అనేక కాలనీల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో అంధకారం అలుముకుంటోంది. స్ట్రీట్​ లైట్ల నిర్వహణ, మరమ్మతులు చేపట్టడంలో కార్పొరేషన్​ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాలనీల్లో అంతర్గత రోడ్లే కాకుండా ప్రధాన రహదారులపై వీధి దీపాలు కూడా వెలగకపోవడంతో రాత్రయితే సగం నగరం అంధకారంలోనే ఉంటోంది. శివారు ప్రాంతాల్లోని రోడ్లపై వీధి దీపాల్లేక చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయి.

Nizamabad City | 60 డివిజన్లు.. 80వేల ఇళ్లు..

నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. సుమారు 80 వేల ఇళ్లు, 4 లక్షల మంది నివాసం ఉంటున్నారు. అయితే కాలనీల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడం కారణంగా స్ట్రీట్​లైట్లు చెడిపోవడం, వెలగకపోవడం వంటి ఇబ్బందులు ఏర్పడితే పట్టించుకునే వారు కరువయ్యారు. కనీసం సమాధానం కూడా ఇవ్వడం లేదని పలువురు వాపోతున్నారు. మూణ్నెళ్ల కాలంలో సుమారు 500కు పైగా వీధి దీపాలు పాడైనట్లు ఫిర్యాదులు అందాయి.

Nizamabad City | ప్రతినెలా రూ. 35లక్షల ఖర్చు..

రాష్ట్రంలోని అన్ని నగరాల్లో వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను ఈఎస్ఎల్ కంపెనీకి అప్పగించారు. కొన్నేళ్లుగా ఇదే కంపెనీ వరుసగా టెండర్లు దక్కించుకుంటుంది. ప్రతి నెలా వీధి దీపాల కోసం సుమారు రూ. 35 లక్షలు వెచ్చిస్తున్నారు. అంటే ఏడాదికి రూ.4 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. మార్చిలో టెండర్ గడువు ముగియడంతో అప్పటి నుంచి వీధి దీపాల మరమ్మత్తు అటకెక్కింది. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకుని నగరంలో అంధకారం లేకుండా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.