అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Royal Enfield | ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లోకి ప్రవేశిస్తోంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఎలక్ట్రిక్ బండి రోడ్డెక్కే అవకాశాలున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) మార్కెట్‌పై రాయల్ ఎన్‌ఫీల్డ్ దృష్టి సారించింది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పేరుతో ఈవీ బైక్‌ను తీసుకువస్తోంది. ఈ మేరకు ఇటీవల ఇటలీలో జరిగిన ఈఐసీఎంఏ 2025లో కంపెనీ సీఈవో బి.గోవిందరాజన్ (CEO B. Govindarajan) ప్రకటన చేశారు. మొదట ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పేరుతో ఈవీ మోడల్‌ను ఆవిష్కరిస్తామని పేర్కొన్న ఆయన.. తర్వాత ఫ్లయింగ్ ఫ్లీ ఎస్6 (Flying Flea S6) మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తామని తెలిపారు.
ఈ బైక్ వచ్చే ఏడాది రెండో అర్ధ భాగంలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ బైక్‌లు మొదట యూరోప్‌లో (Europe) అందుబాటులోకి రానున్నాయి. తర్వాత భారత వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నారు. అయితే ఈ మోడళ్లను ఏ ధరకు అందుబాటులోకి తీసుకురానున్నారో ఇంకా ప్రకటించలేదు. ఎక్స్ షోరూం ధర రూ. 2 లక్షలనుంచి రూ. 3 లక్షల మధ్యలో ఉండే అవకాశాలున్నాయి.
బైక్ ఫీచర్స్ : ఈ బైక్ నగర ప్రయాణాల కోసం రూపొందించబడిరది. ఇది ఒకరి కోసం మాత్రమే డిజైన్ చేయబడిరది. అయితే పిలియన్ సీటును అదనపు యాక్సెసరీగా పొందవచ్చు.
దాదాపు 160 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని తెలుస్తోంది. గరిష్టంగా 115 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉండనుంది.
అల్యూమినియం ఫ్రేమ్, కలర్ టీఎఫ్‌టీ(TFT) టచ్‌స్క్రీన్, కార్నరింగ్ ఏబీఎస్(ABS) మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.
