అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళి పక్కాగా పాటించాలని డీఎస్పీ శ్రీనివాసరావు (DSP Srinivas Rao) అన్నారు. ఎల్లారెడ్డి పోలింగ్ సెంటర్ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 153 గ్రామ పంచాయతీల్లో జరగనున్న ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Yellareddy | సిబ్బందికి సూచనలు.. సలహాలు..
ఎల్లారెడ్డి డిస్ట్రిబ్యూట్షన్ కేంద్రం నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు (polling stations) సిబ్బందిని పంపుతున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులుగా ఉండకూడదని చెప్పారు.
Yellareddy | స్వేచ్ఛగా ఓటు వేసేలా..
ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని పేర్కొన్నారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. అలాగే ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Yellareddy | సమస్యాత్మక ప్రాంతాల్లో..
సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ సైతం నిర్వహించి ప్రజలకు ఓటుపై భరోసా కల్పించామని డీఎస్పీ తెలిపారు. ఏడు మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా తెలంగాణ స్పెషల్ ఫోర్స్, ఏఆర్ ఫోర్స్, మొబైల్ పార్టీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ, అడిషనల్ కలెక్టర్, డీఎస్పీల పర్యవేక్షణలో ఎన్నికలు సజావుగా జరిగేలా బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.