అక్షరటుడే, కామారెడ్డి: Panchayat Elections | మొదటి విడత ఎన్నికల సమయంలో ఓ తండా వాసులు ఎన్నికలను బహిష్కరించడం చర్చనీయాంశంగా మారింది. స్వయంగా ఆర్డీవో వెళ్లి సముదాయించినా వినిపించుకోకపోవడంతో అక్కడ ఎన్నిక ప్రశ్నార్థకంగా మారింది.
Panchayat Elections | రామారెడ్డిలో..
రామారెడ్డి మండలం గోకుల్ తండాలో (Gokul Thanda) మీది తండా, కింది తండా ఉంటాయి. గతంలో ఈ తండాలో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో మీదితండా వాసి సర్పంచ్ అయ్యారు. మీది తండాలో 350 ఓటర్లు ఉండగా 5 వార్డులు ఉన్నాయి. కింది తండాలో 250 ఓటర్లు ఉండగా 3 వార్డులు ఉన్నాయి. అయితే తమ తండాను ప్రత్యేక పంచాయతీగా (Gram Panchayat) మారిస్తేనే ఓటు వేస్తామని తండావాసులు భీష్మించుకు కూర్చున్నారు.
Panchayat Elections | ప్రత్యేక జీపీ కోసం పోరాటం..
ప్రత్యేక పంచాయతీ చేయకపోతే ఎన్నికలు బహిష్కరించామని పేర్కొన్నారు. దాంతో అక్కడి పరిస్థితి సస్పెన్స్‌గా మారింది. ఓటింగ్ సమయం పూర్తి కావస్తుండడంతో కామారెడ్డి ఆర్డీవో వీణ (Kamareddy RDO Veena) తండాకు వెళ్లి ఓటర్లను ఒప్పించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఎన్నికలు బహిష్కరించినా ప్రత్యేక పంచాయతీ ఇప్పటికిప్పుడు కాదని, వెంటనే ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు. అయినా తండావాసులు వినిపించుకోలేదు.
Panchayat Elections | సర్పంచ్గిరికి ముగ్గురు పోటీ
తండాలో సర్పంచ్ అభ్యర్థులుగా ముగ్గురు పోటీలో ఉన్నారు. మీది తండా నుంచి ఒకరు, కింది తండా నుంచి ఇద్దరు పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. గతంలో మీది తండా సర్పంచ్‌ను ఏకగ్రీవం చేశామని తమను చిన్నచూపు చూస్తున్నారని కిందితండా వాసులు ఆరోపిస్తున్నారు. తమకు ప్రత్యేక పంచాయతీ ఇస్తే వాళ్లకు మాకు ఎలాంటి సంబంధం ఉండదని పేర్కొంటున్నారు.