అక్షరటుడే, కామారెడ్డి : Elderly Woman Human Sacrifice | జిల్లాలోని ఓ గ్రామంలో వృద్ధురాలి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెను నరబలి ఇచ్చారని పుకార్లు వ్యాపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి మాచారెడ్డి మండలం (Machareddy Mandal)లోని ఓ గ్రామంలో ఇటీవల ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా హడావుడిగా అంత్యక్రియలు చేశారు. వారం రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆమెను నరబలి ఇచ్చారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో వారు సైతం గ్రామానికి చేరుకొని పరిశీలించారు.
Elderly Woman Human Sacrifice | తాంత్రికుడి పూజలు?
గ్రామానికి చెందిన ఆ వృద్ధురాలి ఇంట్లో ఇటీవల అనేక సమస్యలు నెలకొన్నట్లు తెలిసింది. వాటి పరిష్కారం కోసం కుటుంబ సభ్యులు ఓ తాంత్రికుడిని సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంట్లో సమస్యలకు నరబలి ఇవ్వడమే పరిష్కారమని చెప్పినట్లు గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. దీంతో వృద్ధురాలిని హత్య చేసి ఆ తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించారని పుకార్లు వ్యాపిస్తున్నాయి. అంతేగాకుండా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కానీ వీరు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆఘమేఘాల మీద అంత్యక్రియలు చేయడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Elderly Woman Human Sacrifice | దహనం చేయడంతో..
సదరు వృద్ధురాలి కుటుంబ సభ్యుల ఆచారం ప్రకారం.. ఖననం చేయాల్సి ఉండగా.. ఆమెను మాత్రం దహనం చేయడం చర్చకు దారి తీసింది. పూడ్చిపెట్టి ఉంటే పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేసేవారు. పోలీసులు శుక్రవారం గ్రామంలో పలువురిని విచారించారు. అయితే నరబలికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని సమాచారం. దాంతో గ్రామంలో సీసీ కెమెరా (CC Camera)లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ పుకార్లతో గ్రామస్తులు భయాందోళనకు గురి అవుతున్నారు.